తెలుగు రాష్ట్రాల్లో కిడ్నీ రాకెట్ కలకలం రేపుతోంది. హైదరాబాద్ కేంద్రంగా పలు ఆసుపత్రుల్లో 30 మందితో కూడిన ముఠా కిడ్నీ ఆపరేషన్ల దందా కొనసాగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. సరూర్‌నగర్‌లోని అలకనంద, జనని ఆసుపత్రుల్లో దందా కొనసాగించారు. ఈ కేసులో ఇప్పటి వరకు హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. రూ.5 లక్షల నగదు, కారు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కిడ్ని రాకెట్లో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు డాక్టర్లు, నలుగురు ఏజంట్లు పరారీలో ఉన్నారు. నిరుపేదల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని ఇప్పటి వరకు 90 కిడ్నీ ఆపరేషన్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో ఆపరేషన్‌కు రూ.55 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కిడ్నీ రాకెట్లో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ సిద్దంశెట్టి అవినాశ్ కీలకంగా వ్యవహరించారు. చైనాలో ఎంబీబీఎస్, పుణెలో డిప్లోమా చేసిన అవినాశ్‌కు ప్రాక్టీస్ పెద్దగా లేకపోవడంతో జనని ఆసుపత్రి నిర్వహణ తీసుకుని కిడ్నీ ఆపరేషన్లు చేయడం ప్రారంభించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. విశాఖకు చెందిన లక్షణ్ ఈ కిడ్నీ రాకెట్లో పేదలను గుర్తించి ఆసుపత్రికి తీసుకువచ్చేవాడని గుర్తించారు. ఆపరేషన్ చేసిన డాక్టర్‌కు రూ.2.5 లక్షలు చెల్లించేవారు. కిడ్నీ ఇచ్చిన వారికి రూ.5 లక్షలు చెల్లించేవారు. కిడ్నీ గ్రహీత నుంచి రూ.75 లక్షల వరకూ వసూలు చేసేవారు.
హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రుల్లో కిడ్నీ ఆపరేషన్లు నిర్వహించినట్లు పోలీసులు చెబుతున్నారు. అలకనంద, అరుణ, జనని ఆసుపత్రులతోపాటు పదుల సంఖ్యలో పలు ఆసుపత్రుల్లో 90 కిడ్నీ ఆపరేషన్లు చేసినట్లు తేలింది. ఈ కేసులో ఇంకా చాలా అరెస్టులుంటాయని సరూర్‌నగర్ డీసీపీ తెలిపారు. విశాఖకు చెందిన పవన్ ఈ కిడ్నీ రాకెట్ సూత్రధారుడిగా అనుమానిస్తున్నారు.