ప్రధాని మోదీ దేశ ప్రజలకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధి దిశగా ప్రయాణం సాగేలా కృషి చేసిన మహనీయులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. గణతంత్ర వేడుకలు రాజ్యాంగ విలువలను కాపాడుతుందని, సుసంపన్నమైన దేశాన్ని నిర్మించే దిశగా మన ప్రయత్నాలను బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నానని మోదీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
ఢిల్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. 76వ గణతంత్ర ఉత్సవాలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. త్రివిధ దళాలు ఒక శకటాన్ని సంయుక్తంగా తీసుకురావడం ప్రత్యేకంగా నిలిచింది. భూమి, గగనతలం, నీటిపై యుద్ధ దృశ్యాల సమ్మేళనంగా శకటాలను ప్రదర్శించారు.
అత్యాధునిక బ్రహ్మోస్ క్షిపణి, భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఆకాశ్ క్షిపణులు, అత్యాధునిక పినాకా రాకెట్ లాంచర్, అధునాతన యుద్ధ ట్యాంకుల ప్రదర్శన ఆకట్టుకుంది.స్వదేశీ సాంకేతికతతో డీఆర్డీవో రూపొందించిన ప్రళయ్ క్షిపణి వీక్షకులను ఆకట్టుకుంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 16 శకటాలు, కేంద్రంలోని పలు శాఖలకు చెందిన 15 శకటాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, త్రివిధ దళాల అధిపతులు, కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.