ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వేబ్రిడ్జిగా చీనాబ్ బ్రిడ్జి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. జమ్మూ, కశ్మీర్ ప్రాంతాలను కలుపుతూ నిర్మించిన రైల్వేలైన్‌లో అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం ఆ వంతెన. ఇవాళ చీనాబ్ బ్రిడ్జి మీద మొదటిసారి ట్రయల్‌రన్ నిర్వహించారు. అదీ, వందేభారత్ రైలుతో ఆ ట్రాక్‌ను ప్రారంభించడం విశేషం.
జమ్మూ ప్రాంతంలోని కట్రా నుంచి కశ్మీర్ ప్రాంతంలోని శ్రీనగర్ వరకూ ప్రత్యేకమైన రైలుమార్గాన్ని భారత రైల్వే నిర్మించి, రికార్డు సృష్టించింది. ఆ రైలుమార్గంలో చీనాబ్ బ్రిడ్జి అయితే ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వేబ్రిడ్జిగా నిలిచింది. చీనాబ్ నది మీద 359 మీటర్ల ఎత్తున ఉన్న ఆ బ్రిడ్జి, ఐఫిల్ టవర్ కంటె 30 మీటర్లు ఎక్కువ ఎత్తులో ఉంది. ఆ బ్రిడ్జి మీదుగా కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలు ఇవాళ పరుగులు తీసింది.
కశ్మీర్ ప్రాంతాన్ని భారత భూభాగంతో కలపడం ద్వారా ఈ రైలుమార్గం ప్రత్యేకతను సంతరించుకుంది. పాకిస్తాన్ ప్రభావం, ఉగ్రవాదుల ప్రాబల్యం ఎక్కువ ఉండే కశ్మీర్ ప్రాంతాన్ని భారత్‌కు అనుగుణంగా మార్చడానికి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే కశ్మీర్లో రవాణా వ్యవస్థను అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తోంది. సరిహద్దుల వెంబడి రహదారుల నిర్మాణంతో పాటు ఇప్పుడు ఈ రైల్వేట్రాక్‌తో కశ్మీర్ ప్రాంతంలోకి భారతీయులు అందరూ సులువుగా చేరగలుగుతారు. అందుకే ఈ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.