భారతీయ రైల్వే వినూత్న ఆలోచనతో ప్రజలకు మరింత చేరువకానుంది. ప్రయాణికులు, సరుకును ఇకపై ఒకేసారి గమ్యం చేర్చేలా డబుల్ డెక్కర్ రైళ్ళను అందుబాటులోకి తీసుకురానుంది. రైల్వే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ డబుల్ డెక్కర్ డిజైన్‌ను రూపొందించగా కేంద్రం నుంచి ఆమోదం లభించింది.ఈ ఏడాది చివరి నాటికే ఈ రైళ్ళు పట్టాలపై పరుగులు తీయనున్నాయి.
కొత్త డిజైన్ లో భాగంగా డబుల్ డెక్కర్ రైలు కింది భాగాన్ని సరుకు రవాణాకు, పై అంతస్తును ప్రయాణికుల కోసం ఉపయోగిస్తారు. దీంతో నిర్వహణ వ్యయం కూడా తగ్గనుంది. కార్గో రవాణా ద్వారా అదనపు ఆదాయం కూడా సమకూరనుంది.
కొత్త డబుల్ డెక్కర్ రైళ్ళలో 18 నుంచి 22 వరకు కోచ్‌లు ఉంటాయి. కపుర్తలా కోచ్ ఫ్యాక్టరీలో వీటిని తయారు చేయనున్నారు. ఒక్కో కోచ్ నిర్మాణానికి రూ. 4 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.
2023-24లో రైల్వే 1,591 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయగా 2030 నాటికి దీనిని 3 వేల మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.