మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పరిధిలోని ప్రధాన పుణ్యక్షేత్రాలు ఉన్న 17 నగరాల్లో మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్వయంగా తెలిపారు. ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్ని మద్యం దుకాణాలు మూసివేస్తామని వివరించారు.
ధటియా, లింగా, పన్నా, మాండ్లా, ముల్తాయి, ఓంకారేశ్వర్, మహేశ్వర్, మండలేశ్వర్, చిత్రకూట్, కుండల్ పూర్, అమర్ కంటక్, ఓర్ఛా, మైహర్, బందక్ పూర్, బర్మన్ ఖర్ద్, మంద్ సౌర్, బర్మన్ కలాలు ఆధ్మాత్మిక నగరాలుగా ప్రసిద్ధి. దీంతో ఈ నగరాల్లో మద్యం దుకాణాల మూసివేతకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నర్మదా నది పరివాహక ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల పరిధిలోని మద్యం దుకాణాలు కూడా మూసివేయనున్నట్లు తెలిపారు. డిప్యూటీ సీఎం జగదీశ్ దేవ్డా మాట్లాడుతూ తమ ప్రభుత్వం పూర్తిస్థాయి మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ నిర్ణయంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భావితరాలు మద్యానికి బానిస కాకుండా కాపాడేందుకు ఈ నిర్ణయం దొహదపడుతుందన్నారు. ప్రస్తుత కాలంలో మద్యం తాగడాన్ని చాలా మంది స్టేటస్ గా భావిస్తున్నారని అన్నారు. వాస్తవానికి మద్యం అనేది ఆరోగ్యానికి చాలా హానికరమని తెలిసినప్పటికీ తాగుతున్నారన్నారు. బీజేపీ సర్కారు నిర్ణయంతో పుణ్యక్షేత్రాలున్న ప్రాంతాల ప్రాధాన్యం మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.