వైసీపీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి శుక్రవారం ట్వీట్ చేశారు. వైసీపీకి రాజీనామా చేసి, ఆ లేఖ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి పంపించారు. ఇన్నాళ్లూ తనను ఆదరించి, అనేక పదవులు కట్టబెట్టిన పార్టీ అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు. తనకు ఏ పార్టీలో చేరే ఉద్దేశం తనకు లేదని చెప్పుకొచ్చారు. వ్యవసాయం చేయాలనుకుంటున్నట్లు ప్రకటించారు. రాజీనామా వెనుక ఎవరి ఒత్తిడిలేదన్నారు. ఎవరూ తనకు ఫోన్ చేయవద్దని కూడా ట్వీట్ చేశారు.
వైసీపీ రాజ్యసభ ఎంపీ పదవికి శనివారంనాడు రాజీనామా చేస్తానని ప్రకటించారు. శుక్రవారంనాడు వక్ఫ్ బోర్డు సమావేశంలో పాల్గొన్న విజయసాయిరెడ్డి సమావేశం పూర్తి కాగానే రాజీనామా లేఖను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. గత కొంత కాలంగా విజయసాయిరెడ్డి బీజేపీలో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తలకు ఇది బలం చేకూర్చింది. అయితే ఇక రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పినట్లు విజయసాయిరెడ్డి ప్రకటించడం విశేషం.
ఎంపీ విజయసాయిరెడ్డి బాటలో మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన విదేశాల్లో ఉన్నారు. మరో వారంలో ఏపీకి తిరిగి వచ్చాక రాజీనామా చేస్తారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించకపోవడంతో అలాంటి వార్తలకు బలం చేకూరింది. విజయసాయిరెడ్డి రాజీనామాపై వైసీపీ అధినేత స్పందించాల్సి ఉంది.