గణతంత్ర దినోత్సవం నాడు జరిగే కవాతులో ఈ యేడాది రెండు కొత్త అంశాలను జోడిస్తున్నట్లు భారత సైన్యం ప్రకటించింది. వాటిలో మొదటిది యుద్ధరంగంల ఉపయోగించే నిఘా వ్యవస్థలు (బ్యాటిల్ఫీల్డ్ సర్వెయిలెన్స్ సిస్టమ్స్). రెండవది స్వల్పదూరం ప్రయోగించగల ‘ప్రళయ్’ క్షిపణులను ప్రదర్శించే డీఆర్డీఓ శకటం.
ఆ వివరాలను మీడియాకు భారత సైన్యం తరఫున మేజర్ జనరల్ సుమీత్ మెహతా వెల్లడించారు. ఈ యేడాది గణతంత్ర దినోత్సవం నాటి కవాతులో సుమారు 5వేల మంది సాంస్కృతిక కళాకారులు ప్రదర్శనలిస్తారు. సాధారణంగా వారు రాష్ట్రపతి ఆసీనులై ఉండే ప్రదేశం దగ్గర ప్రదర్శనలు ఇస్తారు. అయితే ఈసారి మాత్రం వేడుకలు చూడడానికి వచ్చే అందరికీ కనిపించేలా కర్తవ్యపథ్ రహదారి పొడుగునా ప్రదర్శనలు ఇస్తూ ముందుకు సాగుతారని సుమీత్ మెహతా వెల్లడించారు.
భారత రక్షణ రంగానికి చెందిన పరిశోధనా సంస్థ డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) శకటం ఈ యేడాది గణతంత్ర వేడుకల్లో తమ తాజా పరిశోధనల ఫలితాలను ప్రదర్శించనుంది. ఆ శకటం ఎంచుకున్న థీమ్ ‘రక్షా కవచ్’. వివిధ రకాలుగా ఎదురయ్యే ముప్పుల నుంచి కాచుకోడానికి బహుళ అంచెల రక్షణ వ్యవస్థను డీఆర్డీఓ రూపొందించింది. అందులో త్వరగా స్పందించగల సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, ఆకాశం నుంచే ప్రయోగించగల ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, అడ్వాన్స్డ్ టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్, డ్రోన్ డిటెక్ట్ డిటర్ అండ్ డిస్ట్రాయ్ సిస్టమ్, ఉపగ్రహ ఆధారిత నిఘా వ్యవస్థ, మధ్యస్థాయి పవర్ రాడార్ ‘ఆరుద్ర’, అత్యాధునిక తేలికపాటి టార్పెడో, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ ‘ధరాశక్తి’, లేజర్ ఆధారిత డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్, అతిస్వల్పస్థాయి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, దేశీయంగా రూపొందించిన మానవ రహిత ఏరియల్ సిస్టమ్, మ్యాన్ప్యాక్ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియో, దేశీయంగా రూపొందించిన శాటిలైట్ ఫోన్, ‘ఉగ్రమ్’ అసాల్ట్ రైఫిల్ ఉన్నాయి.
ఈసారి గణతంత్ర దినోత్సవానికి అతిథిగా ఇండోనేసియా అధ్యక్షుడు వస్తున్నారు. ఆయన ఇలా హాజరవడం ఇది నాలుగోసారి. జనవరి 29 సాయంత్రం 5.15 గంటలకు బీటింగ్ రిట్రీట్ వేడుక విజయ్ చౌక్ వద్ద నిర్వహిస్తారు. అందులో భాగంగా త్రివిధ దళాలు, సీఏపీఎఫ్కు చెందిన బ్యాండ్లు ప్రదర్శనలు ఇస్తాయి.