భారతీయ మాజ్దూర్ సంఘ్ 70వ వార్షికోత్సవం సందర్భంగా కార్మిక బంధువులందరినీ వారి వారి ఇళ్ళలో వ్యక్తిగతంగా వారి కుటుంబ సభ్యులతో కలిసి వారి సాధక బాధకాలను తెలుసుకొని వారికి అండగా నిలబడే “గృహ సంపర్క్” కార్యక్రమం తలపెటింది.
దానికి సంబంధించి భారతీయ మాజ్దూర్ సంఘ్, విశాఖపట్నం శాఖ ఇవాళ కరపత్రం విడుదల చేసింది. ఆ కరపత్రాన్ని విశాఖపట్నం జిల్లాలో ఉన్న ప్రతీ కర్మాగారంలో, ప్రతీ కార్మిక కుటుంబానికీ చేర్చాలని నిర్ణయించారు.
ఆ కార్యక్రమంలో బిఎంఎస్ జిల్లా అధ్యక్షులు రొక్కం సురేష్ కుమార్ అధ్యక్షత వహించారు. బిఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవిఎస్ నాయుడు దిశా నిర్దేశం చేసారు. సంస్థ రాష్ట్ర కార్యదర్శి లోవరెడ్డి, జిల్లా ఇంచార్జి లాలం ప్రసాద్, జిల్లా కార్యదర్శి సరగడం చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
భారతీయ మజ్దూర్ సంఘ్ మనదేశంలో అతిపెద్ద కార్మిక సంస్థ. 1855లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు లోకమాన్య బాలగంగాధర తిలక్ జన్మదినమైన జులై 23న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఈ సంస్థను దత్తోపంత్ ఠేంగ్డే స్థాపించారు. 2025 జులై 23న 70వ వార్షికోత్సవం జరుపుకోనున్న బిఎంఎస్ ప్రస్తుతం సుమారు 2కోట్ల మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 44 పారిశ్రామిక వర్గాల ఫెడరేషన్స్ ఉన్నాయి.
పార్టీ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్న బిఎంఎస్లో కార్మికుడే కార్మిక నాయకుడు. వ్యక్తి హితానికి కాక దేశ హితానికి, వ్యక్తి నిష్ఠకు కాకుండా ధ్యేయ నిష్ఠకూ ప్రాధాన్యం ఇవ్వడం ఈ సంస్థ ప్రత్యేకత. వర్గ సంఘర్షణకు వ్యతిరేకంగా నిలిచే బిఎంఎస్ పారిశ్రామిక కుటుంబ కల్పన తమ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ సంస్థ కార్మికుల ప్రయోజనాల కోసం భారతీయ శ్రమశోధ మండల్, సర్వపంత్ సమాదర్ మంచ్, పర్యావరణ్ మంచ్, విశ్వకర్మ శ్రామిక్ శిక్షా సంస్థాన్ వంటి పలు సంస్థలను నెలకొల్పింది.
దేశంలో అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. వారికి ఇఎస్ఐ-పిఎఫ్ సదుపాయాలు, విద్య-గృహనిర్మాణం-చిరువ్యాపారాల నిమిత్తం ఆర్థిక సహాయం అందించాలి. 60ఏళ్ళు దాటిన కార్మికులకు పింఛన్ ఇవ్వాలి, కాంట్రాక్టు లేబర్ను శాశ్వతం చేయాలి, ఒకే దేశం ఒకే టాక్స్ విధానం ప్రవేశపెట్టాలి… అన్నవి బిఎంఎస్ ప్రధాన డిమాండ్లు.