తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై మంగళవారం నాడు కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ మీద ఢిల్లీ బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిదూరి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహంతో తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు ఆ దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాళ్ళతో చేసిన దాడిలో బీజేపీ నాయకుడికి గాయాలయ్యాయి.
నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించారు. రాళ్ళు రువ్వుతూ కనిపించిన వారినల్లా కర్రలతో కొట్టారు. కాంగ్రెస్ దాడిని అడ్డుకోడానికి బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. కాంగ్రెస్ దాడిలో బీజేపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తలకు బలమైన గాయమైంది. ఆయనను నాంపల్లిలోని కేర్ ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉంది.
కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి యూత్ కాంగ్రెస్ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండించారు. ‘‘తెలంగాణ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం పైన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలు, రౌడీల్లాగా వ్యవహరిస్తూ.. రాళ్లతో, కర్రలతో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది పిరికిపిందల చర్య. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ పార్టీ తన తీరును మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాను. పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర బీజేపీ ఆఫీస్ గేటు వద్ద దాడికి పాల్పడటం దుర్మార్గం. బీజేపీ కార్యాలయం ముందు వరకు చేరుకుని రాళ్లు, కర్రలతో కాంగ్రెస్ గూండాలు పోలీసుల సమక్షంలో, పోలీసులతో కలిసి వచ్చి ఆఫీస్ పైన, బీజేపీ కార్యకర్తలపైన దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలకు, భౌతిక దాడులకు తావు లేదు. ఇలాంటి రాజకీయాలకు మేం పూర్తి వ్యతిరేకం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి కక్షపూరిత, ద్వేషపూరిత రాజకీయాలు రాష్ట్రంలో పెరిగిపోయాయి. గతంలో సొంతపార్టీకి చెందిన ముఖ్యమంత్రులను గద్దెదించేందుకు మతకల్లోలాలు సృష్టించిన దుర్మార్గమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతం. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అసమర్థ పాలనతో ప్రజల్లో ఆదరణ కోల్పోతున్న తరుణంలో.. అసహనంతో ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోంది. ఇలాంటి దాడులను ఆపకపోతే.. ఆ తర్వాత తలెత్తే పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాను. పోలీసుల సమక్షంలో బీజేపీ కార్యాలయంపై దాడిచేసి.. మా కార్యకర్తలను గాయపరిచే విషయం ముఖ్యమంత్రికి తెలియకుండా జరగదు. ఖబడ్దార్, అసహనం కోల్పోయి మీరు చేస్తున్న చర్యలకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు తిరగబడితే.. దేశంలో కాంగ్రెస్ కు ఉన్న కొద్దిపాటి నాయకులు తిరుగలేని పరిస్థితులు ఏర్పడుతాయి. రాష్ట్రంలో ఈ రకమైన దాడులతో భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాను. మా సహనాన్ని అసమర్థతగా భావించొద్దు. మేం హింసా రాజకీయాలను ప్రోత్సహించం. అలాగని మాపై దాడులు చేస్తే సహించం. ఎవరి వ్యాఖ్యలైనా మీకు నచ్చకపోతే.. నిరసన తెలియజేయండి అంతే కాని.. కార్యాలయంపై భౌతికంగా దాడి చేయడం, రాళ్లు, కర్రలతో దాడికి దిగడం సరికాదు. తన వ్యాఖ్యలకు ఢిల్లీకి చెందిన మాజీ ఎంపీ రమేశ్ భిదూరీ గారు క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా.. అసహనంతో దాడులు చేయడం సరైనదేనా.. గతంలోనూ ప్రధానమంత్రి గారికి పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక గాంధీ-నెహ్రూ కుటుంబసభ్యులు.. తీవ్ర అసహనంతో.. తక్కువ కులంవాడు, చాయ్ అమ్ముకునే వ్యక్తి ఎలా ప్రధాని అవుతారు, మౌత్ కా సౌదాగర్, హిట్లర్ వంటి ఎన్నో అవాక్కులు, చెవాక్కులు పేలారు. దీన్ని ఖండిస్తూ బీజేపీ ఎక్కడైనా దాడులు చేసిందా? ఈ వ్యాఖ్యలకు ఒక్కసారి కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒక్కసారైనా క్షమాపణలు చెప్పారా? అలాంటి సంస్కారం కాంగ్రెస్ పార్టీకి లేదు. మేం దీనికి ప్రతిగా సమాధానం చెబితే.. ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు దేశంలో రోడ్లపై తిరగలేడు. కానీ ఇది మా సంస్కృతి కాదు. మీ సంస్కృతిని మార్చుకోండి. ఖబడ్దార్ !!’’ అంటూ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కూడా కాంగ్రెస్ దాడిని తీవ్రంగా ఖండించారు. ‘‘కాంగ్రెస్ గూండాల్లారా, బీజేపీ కార్యాలయం మీద చేయి వేయడానికి ఎంత ధైర్యం. మా బీజేపీ కార్యకర్తలే తలచుకుంటే మీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పునాదులతో సహా పెకలించివేయగలరు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం మీద కాంగ్రెస్ గూండాలు దాడిచేయడం పిరికిపంద చర్య, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మా కార్యాలయం ఒక పవిత్ర ప్రదేశం అక్కడ స్త్రీపురుషులు నిర్విరామంగా అలసట లేకుండా పనిచేస్తూ ఉంటారు. వారు గాయపడితే ఏమై ఉండేది? కాంగ్రెస్ రౌడీయిజానికి భయపడే ప్రసక్తే లేదు. ఆ ఘటనకు బాధ్యులైన వారిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని బండి సంజయ్ ట్వీట్ చేసారు.
రాజ్యసభ ఎంపీ, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఆ సంఘటనను ఒవైసీ సోదరుల కుట్రగా వర్ణించారు. ఆ దాడులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లదే పూర్తి బాధ్యత అని మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి ఏమాత్రం ఆలస్యం లేకుండా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీసారు. ‘‘ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? నీ నిఘా విభాగం సరిగ్గా పనిచేస్తోందా?’’ అని మండిపడ్డారు.
మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఈ ఘటన వెనుక అసదుద్దీన్ ఒవైసీ పాత్ర ఉందని ఆరోపించారు. ‘‘బిజెపి రాష్ట్ర కార్యాలయం పై గూండాలు రౌడీషీటర్లు కాంగ్రెస్ కార్యకర్తల ముసుగులో దాడి చేశారు ఈ దాడికి రేవంత్ రెడ్డి అసదుద్దీన్ ఓవైసీ బాధ్యత వహించాలి నిన్న ఒకే వేదికపై ఓవైసీ సోదరులతో వేదిక పంచుకోగానే రేవంత్ రెడ్డి అక్కడే ఈ దాడికి పథకాన్ని రచించారు గతంలో తమ సొంత ముఖ్యమంత్రిని దించడం కోసం చెప్పులు వేయడం మత కల్లోలాలు సృష్టించడం వారి చరిత్రలో భాగమే. బిజెపి కార్యాలయం పై పోలీసులే దగ్గరుండి దాడి చేయించినట్టుగా కనబడుతున్నది. ఢిల్లీలో మా మాజీ ఎంపీ పొరపాటున దొర్లిన ఒక పదానికి వెంటనే వెనక్కి తీసుకొని తన హుందాతనాన్ని ప్రదర్శించారు కానీ నకిలీ గాంధీ కుటుంబ సభ్యుల కోసం ఇక్కడ కొందరు రౌడీషీటర్లు కాంగ్రెస్ ముసుగులో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా సన్నగిల్లిపోయినాయి గుండాలకు రౌడీషీటర్లకు ఉగ్రవాదులకు నక్సలైట్లకు పూర్తి స్వేచ్చని ఇచ్చి తెలంగాణను కుక్కలు చింపిన విస్తరి చేయమని సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలు చెప్పారా బిజెపి కార్యాలయంపై కార్యకర్తలపై నాయకులపై దాడులకు పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీలు క్షమాపణ చెప్పాలి మా ఓపికను సహనాన్ని పరీక్షించాలి అనుకుంటే అది మీ ఇష్టం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనం బిజెపి కార్యాలయం పై దాడితో మొదలైంది గుర్తుపెట్టుకోండి’’ అని ట్వీట్ చేసారు.
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కాంగ్రెస్ దాడిని తీవ్రంగా ఖండించారు. అటువంటి చిల్లర రాజకీయాలు పనికిరావన్నారు. రేవంత్ రెడ్డీ, జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానకపోతే, దానికి తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.