పార్లమెంటు సాక్షిగా ఇండీ కూటమిలో లుకలుకలు బయటపడ్డాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం నుంచి అదానీపై అమెరికాలో నమోదైన కేసులపై జేపీసీ వేయాలంటూ ప్రతిపక్షాలు ఉభయసభలను స్తంభింపజేస్తున్నాయి. అయితే అన్నిపక్షాలతో స్పీకర్ చర్చలు జరిపారు. నేటి నుంచి ఉభయసభల్లో ప్రశ్నోత్తరాలు ప్రారంభం అయ్యాయి. సంభల్లో అల్లర్లపై చర్చ చేపట్టాలంటూ ప్రతిపక్షాల సభ్యులు పార్లమెంటు సమావేశాలు బహిష్కరించారు. పార్లమెంటు ఆవరణలో ఇండీ కూటమి సభ్యులు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు.
ఇండీ కూటమి చేపట్టిన నిరసన కార్యక్రమాలకు సమాజ్ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు దూరంగా ఉన్నారు. పార్లమెంటు బయట ఇండీ కూటమి ఎంపీలు ఆందోళన చేస్తుండగా ఎస్పీ, టీఎంసీ సభ్యులు సభలోనే ఉన్నారు. దీంతో ఇండీ కూటమిలో లుకలుకలు బయటపడ్డాయి. ఉభయసభల్లో జరిగే చర్చల్లో పాల్గొంటామంటూ ఎస్పీ, టీఎంసీ ప్రకటించాయి.
ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో వాయిదా పడుతూ వచ్చిన ఉభయ సభల్లో ఇవాళ ప్రశ్నోత్నరాలు నడిచాయి. పలు బిల్లులు ప్రవేశపెట్టి చర్చ జరుపుతున్నారు. రాజ్యాంగం ఆమోదం పొంది 75 సంవత్సరాల సందర్భంగా ఈ నెల 13, 14న లోక్సభలో ప్రత్యేక చర్చ చేపట్టనున్నారు. 16,17 రాజ్యసభలో చర్చిస్తారు.