అదానితో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు సీఎం గా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఉన్నారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. ఇప్పుడు వైఎస్ జగన్, అదానితో సంబంధం లేదనడం హాస్యాస్పదమన్నారు. అదానీ గ్రూపు వ్యాపారాలతో బీజేపీకి ఎక్కడా సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు.
ఇక ఈవీఎం టాంపరింగ్ అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను ఆమె తోసిపుచ్చారు. విపక్షాల ఆరోపణలను ప్రజలను నమ్మడం లేదని దుయ్యబట్టారు. దేశ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు అంతా కలసికట్టుగా పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారని ప్రశంసించారు. 2024 లో దేశ వ్యాప్తంగా 11కోట్ల మందికి సభ్యత్వం చేయగలిగామని లెక్కలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో 25లక్షల మందికి సభ్యత్వం ఇచ్చినట్లు వెల్లడించారు.
దేశానికి సుపరిపాలన అందించటంలో, అవినీతి కి చోటు లేకుండా పరిపాలన అందించటంలో బీజేపీని మించిన పార్టీలేదన్నారు. హర్యానాలో, మహారాష్ట్ర లో కనివిని ఎరుగని రీతిలో విజయం సాధించడం బీజేపీ పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసానికి నిదర్శనం అన్నారు.
విజయవాడ లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘటన్ పర్వ్ 2024- వర్క్ షాపులో పాల్గొన్న పురంధరేశ్వరి కార్యకర్తలు, నేతలకు మార్గనిర్దేశం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ కె లక్ష్మణ్ , జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ , బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, బీజేపీ ఏపీ రిటర్నింగ్ అధికారి పాకా వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు.