ఫెంగస్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. తుఫాను ప్రభావంతో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. రన్ వేపై 2 అడుగుల మేర వరద చేరడంతో మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో వందలాది విమాన సర్వీసులను దారి మళ్లించడం, రద్దు చేయడం చేశారు. ప్రతి రోజూ చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో 760కుపైగా విమానాలు సేవలు అందిస్తున్నాయి.
తుఫాను ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురిసింది. దీంతో చలి తీవ్రంగా పెరిగి భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పాపనాశనం వెళ్లే దారిని మూసివేశారు. భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని టీటీడీ అధికారులు సూచించారు.
ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. విద్యుత్ శాఖ, రెవెన్యూ అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. తుఫాను కాసేపట్లో తీరం దాటే అవకాశం ఉండటంతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండి అధికారులు తెలిపారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదముందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.