భూతాపం తగ్గించడం, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో అజర్బైజాన్ రాజధాని బాకులో జరుగుతోన్న COP 29 సదస్సు ఆదివారం కూడా కొనసాగింది. పర్యావరణ పరిరక్షణకు అభివృద్ధి చెందిన దేశాలు 30 బిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించడంపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అభివృద్ధి సాధించిన దేశాలు తమ బాధ్యతను నెరవేర్చేందుకు ఆసక్తి చూపడం లేదనే విషయం తాజా ప్యాకేజీతో అర్థమైందని భారత బృందం ప్రతినిధి చాందినీ రైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పర్యావరణాన్ని కాపాడటం, భూతాపం తగ్గించేందుకు అభివృద్ధి చెందిన దేశాలు, వెనుకబడిన దేశాలకు అందించే ఆర్థిక ప్యాకేజీని 30 బిలియన్ డాలర్లకు పరిమితం చేయడంపై నైజీరియా కూడా వ్యతిరేకించింది. శుక్రవారంతోనే కాప్ 29 సదస్సు ముగియాల్సి ఉండగా చాలా దేశాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆదివారం వరకు సమావేశాలు కొనసాగించారు.
కాలుష్యం తగ్గించడం, ఎక్కువ కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు మూసివేయడం వాహనాలకు గ్రీన్ ఎనర్జీ ఉపయోగించడం, అడవులు పెంచడం వంటి కార్యక్రమాలపై కాప్ 29 వేదికగా చర్చించారు. ఈ క్రమంలో అభివృద్ది చెందుతోన్న దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థికంగా సాయం చేయాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది.ఈ సాయం 30 బిలియన్ డాలర్లకే పరిమితం చేయడంపై పేద దేశాల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది.