గోవా సముద్ర జలాల్లో జలాంతర్గామిని ఓ చేపల వేట సాగించే పడవ ఢీ కొట్టింది. ఈ ప్రమాదం నుంచి 11 మందిని నేవీ సిబ్బంది కాపాడారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చేపట్టారు. సమీప ప్రాంతాన్ని నేవీ అధీనంలోకి తీసుకుంది. ప్రమాదం జరిగిన ప్రాంతం వైపు నుంచి నౌకల మార్గాలను మళ్లించారు.
స్కార్పియన్ శ్రేణికి చెందిన అత్యాధునిక జలాంతర్గామిని ఓ చేపల వేట సాగించే మర పడవ ఢీ కొట్టడం ఇదే మొదటి సారి. ప్రమాద కారణాలు తెలియాల్సి ఉంది. గోవా తీరానికి 70 మైళ్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
స్కార్పియన్ శ్రేణి జలాంతర్గామికి అత్యాధునిక యుద్ధ సామర్థ్యాలున్నాయి. యాంటీ సర్ఫేస్ వార్ఫేర్,యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఈ స్కార్పియన్ సొంతం. శబ్ద నియంత్రణతో ఇది ప్రయాణిస్తుంది. శత్రువుల కంటికి చిక్కకుండా ప్రయాణిస్తుంది. జలాంతర్గామికి సమీపంలోకి ఎలాంటి నౌకలు, పడవలను అనుమతించరు. అయితే ఈ ప్రమాదం ఎలా చోటు చేసుకుంది అనే విషయంపై రక్షణ శాఖ ఎలాంటి ప్రకటన చేయలేదు.