పాకిస్తాన్‌లోని సింధ్ ప్రొవిన్స్ సంఘార్ జిల్లాలో ఒక హిందూ మైనర్ బాలికను బలవంతంగా మతం మార్చారు. ఆమె వయసుకు మూడు రెట్ల కంటె ఎక్కువ వయసున్న ముసలి ముస్లిం వ్యక్తి ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. ఈ దారుణం నవంబర్ 18 సోమవారం నాడు జరిగింది.
బాధిత బాలిక వయసు 15ఏళ్ళు. ఆమెను 50ఏళ్ళ మొహమ్మద్ బాగ్ అలీ బలవంతంగా పెళ్ళి చేసుకున్నాడు. మైనర్ హిందూ బాలిక పేరును ‘సైమా’ అని మార్చేసారు.
పాకిస్తాన్‌లోని సింధ్ ప్రొవిన్స్‌లో హిందువులపై మతపరమైన దాడులు చేయడం, హిందూ మైనర్ బాలికలను ఎత్తుకుపోవడం, వారిని బలవంతంగా మతం మార్చడమూ చాలా ఎక్కువ.
ఈ కేసులో మతమార్పిడి సర్టిఫికెట్, కోర్టు అఫిడవిట్‌ను పరిశీలిస్తే బాధితురాలు వయోజనురాలు అని, ఆమె ఈ పెళ్ళికి మనస్ఫూర్తిగా ఒప్పుకుందనీ అందులో రాసారు. బలవంతపు మతమార్పిడులు, బలవంతపు పెళ్ళిళ్ళను చట్టబద్ధం చేసేందుకు మౌల్వీలు సాధారణంగా అనుసరించే వ్యూహం అదే. ఈ పెళ్ళిని జరిపించిన మౌల్వీ పేరు మౌలానా అబ్దుల్ గఫూర్ మంగల్.
నా తల్లిదండ్రుల ఇంటిని వదిలిపెట్టి వచ్చేందుకు నన్ను ఎవరూ ప్రలోభపెట్టలేదు, అపహరించలేదు, లేదా నాపై ఎవరూ ఒత్తిడి చేయలేదు. నేను ఇప్పుడు షరియత్-ఎ-మొహమ్మద్ ప్రకారం ఇస్లాం మతాన్ని ఆమోదిస్తున్నాను. ఇది పూర్తిగా నా ఇష్ట ప్రకారం జరిగింది. ఇస్లాం మతబోధనలు నాకు బాగా నచ్చాయి, అందువల్లే నేను నా సొంత అభిప్రాయంతో, నా ఆమోదంతో ఇస్లాం మతాన్ని స్వీకరించాను’’ అని ఆ అఫిడవిట్లో పేర్కొన్నారు.