తెలంగాణలో మరో దేవాలయంలో ఘోరం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రాచీన దేవాలయమైన శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో గురువారం రాత్రి మంటలు అంటుకున్నాయి.
ఆలయం ఆవరణలో మంటలు వ్యాపించడంతో హనుమంతుడి విగ్రహం పూర్తిగా దగ్ధమైపోయింది. గర్భగుడి మొత్తం అగ్నికి ఆహుతైపోయింది. ఆ లోపల ఉన్న పూజ సామగ్రి, పురోహితుడి దుస్తులు మొదలైనవన్నీ తగులబడిపోయాయి.
మంటలను చూసిన స్థానికులు వెంటనే దాన్ని ఆర్పడానికి ప్రయత్నించారు. అధికారులు సంఘటనా స్థలాన్ని హుటాహుటిన చేరుకుని ఆలయాన్ని పరిశీలించారు. దేవాలయ పురోహితుడు నాగేశ్వర శర్మ ఈ సంఘటనపై అనుమానాలు వ్యక్తం చేసారు. హనుమంతుడి విగ్రహం మీద ప్లాస్టిక్ పదార్ధాలు కనిపించాయని చెప్పారు. ఇది ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి అయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. వైదిక పండితులను సంప్రదించి హనుమంతుడి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేస్తామని పూజారులు, గ్రామస్తులు చెప్పారు.
దసరా నవరాత్రుల తర్వాత హైదరాబాద్ కుమ్మరిగూడ ప్రాంతంలో ముత్యాలమ్మ గుడిలో అమ్మవారి విగ్రహం మీద దాడి జరిగింది. దానికి బాధ్యుడైన సలీం సల్మాన్ ఠాకూర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఆ తర్వాత కూడా హిందూ దేవాలయాలపై చిన్నాపెద్దా దాడులు జరుగుతూనే ఉన్నాయి.