బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడింది. దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన ఆవర్తనం రేపటికి అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనం నవంబరు 26 నాటికి వాయుగుండంగా, తరవాత తుఫానుగా మారే అవకాశముందని అంచనా వేశారు. అల్పపీడనం ప్రభావంతో రేపటి నుంచి ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
అల్పపీడనం వాయుగుండంగా తరవాత తీవ్ర తుఫానుగా మారే అవకాశముందని అంచనా వేస్తున్నారు. వీటి ప్రభావంతో 26, 27 తేదీల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముంది. రైతులు పంటల నూర్పిడి వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. భారీ వర్షాలు, పెనుగాలులు వీచే ప్రమాదముందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
అల్పపీడనం ప్రభావంతో రేపటి నుంచి ఏపీ, తెలంగాణ, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండి అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో చలితీవ్రత మరింత పెరిగే ప్రమాదముంది. ఏపీలో గరిష్టంగా 31, కనిష్ఠంగా 8 డిగ్రీలు నమోదవుతోంది.