ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసుపై వైట్‌హౌస్ వర్గాలు స్పందించాయి. ఈ సంక్షోభాన్ని ఇరుదేశాలు అధిగమించగలవని వైట్‌హౌస్ ఆశాభావం వ్యక్తం చేసింది. దీనిపై న్యాయశాఖ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ సమాధానం చెప్పాల్సి ఉంటుందని వైట్‌హౌస్ మీడియా సలహాదారు కరీన్ స్పష్టం చేశారు. లంచాలివ్వడం ద్వారా 16 వేల కోట్లు లాభం పొందేందుకు అదానీ ప్రయత్నించారని, తప్పుడు పత్రాల ద్వారా అమెరికాలో పెట్టుబడులు స్వీకరించారనే అభియోగాలపై కేసు నమోదైన సంగతి తెలిసింది.
అమెరికా ఫారిన్ కరెప్టెడ్ ప్రాస్టీసెస్ చట్టం కింద అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ,
అజూర్ పవర్ సీఈవో రంజిత్ గుప్తా, సాగర్ అదానీ సహా మరో ఐదుగురిపై కేసు నమోదైంది. మొత్తం ఎనిమిది మందిపై అభియోగాలు మోపారు.
తాజా కల్లోలంపై అమెరికా ప్రభుత్వం స్పందించింది. ఈ వ్యవహారం భారత్,అమెరికా సంబంధాలను ఏ మాత్రం దెబ్బతీయలేదని కరీన్ స్పష్టం చేశారు. గతంలో మాదిరే భారత్, అమెరికా సంబంధాలు కొనసాగుతాయని వైట్‌హౌస్ మీడియా సలహాదారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్,ఒడిషా ప్రభుత్వంలో పెద్దలకు రూ.1750 కోట్లు లంచంగా ఇచ్చారని, ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో చేసుకున్న ఒప్పందాలు చూపి అమెరికాలో రూ.40 వేల కోట్లు సేకరించే ప్రయత్నాల్లో భాగంగా రూ.16 వేల కోట్లు నిధులు సేకరించినట్లు అభియోగాలు నమోదు చేశారు. ఏపీలో విద్యుత్ ఒప్పందాలు చేసుకోవడానికి రూ.1750 కోట్లు లంచాలు ఇచ్చినట్లు సాగర్ అదానీ ఫోన్ నుంచి వివరాలను అమెరికా ఎఫ్బిఐ సేకరించింది.