బలోచిస్తాన్‌లోని కలట్ జిల్లాలో శుక్రవారం రాత్రి పాకిస్తాన్ సైనికులపై దాడి జరిగింది. ఆ దాడిలో కనీసం ఏడుగురు పాకిస్తానీ సైనికులు హతమయ్యారు. మరో 18మందికి గాయాలయ్యాయి.
కలట్ నగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోహాన్‌లోని షా మర్దాన్ ప్రాంతంలో పాకిస్తాన్ సైనికుల క్యాంప్ ఉంది. ఆ క్యాంప్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగింది. నవంబర్ 15 రాత్రి 9 గంటల తర్వాత మొదలైన దాడి అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగింది. బలోచ్ తిరుగుబాటుదారులు ఒక చెక్‌పోస్టును, దాన్ని దాటాక ఉన్న సైనిక క్యాంపును లక్ష్యంగా చేసుకుని దాడులు చేసారు.
మంగోచెర్ ప్రాంత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అలీ గుల్ బలోచ్, దాడి జరిగిందని, ఆ దాడిలో ఏడుగురు సైనికులు మరణించారనీ నిర్ధారించారు. గాయపడినవారిని క్వెట్టాలోని కంబైన్డ్ మిలటరీ హాస్పిటల్‌కు హెలికాప్టర్ల ద్వారా ఎయిర్‌లిఫ్ట్ చేసారు. మృతదేహాలను కూడా అదే ఆస్పత్రికి పోస్ట్‌మార్టం కోసం తరలించారు. పాకిస్తాన్ నుంచి విముక్తి కావాలన్న డిమాండ్‌తో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గత కొన్ని నెలలుగా పాకిస్తాన్‌తో పోరాడుతోంది. ఆ క్రమంలోనే ఈ దాడి జరిగింది.
బలోచిస్తాన్‌లోని కలట్ ప్రాంతం 1947 ఆగస్టు నుంచి 1948 మార్చి వరకూ స్వతంత్రంగా ఉంది. దేశ విభజన సమయంలో ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్ బలవంతంగా విలీనం చేసుకుంది. పాకిస్తాన్‌లోని అరాచక పరిపాలన, బలోచ్ ప్రాంతం పట్ల వివక్ష వంటి కారణాలతో ఆ ప్రాంతంలో కొన్నేళ్ళ క్రితం పాకిస్తాన్ నుంచి విడిపోడానికి ఉద్యమాలు మొదలయ్యాయి. స్వతంత్ర బలోచిస్తాన్ నినాదంతో పోరాడుతున్న వారు పాక్ సైన్యంపై పోరాడుతున్నారు. పలు దాడులు చేస్తున్నారు. ఆ క్రమంలో జరిగిన ఈ దాడికి పాల్పడింది తామేనంటూ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ – బిఎల్ఎ ఒక ప్రకటన విడుదల చేసింది.
పాకిస్తాన్ ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్ కలట్ దాడిని ఖండించారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఇటువంటి దాడులు పాకిస్తాన్ సమైక్యతను అడ్డుకోలేవని బీరాలు పలికారు. పాక్ సైన్యం సాయంతో బలోచిస్తాన్ సమస్యను అణగదొక్కేస్తామన్నారు. పాకిస్తాన్ హోంమంత్రి మొహిసిన్ నక్వీ, పాక్‌లోని పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మర్యం నవాజ్ షరీఫ్‌లు కూడా కలట్ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఆ ప్రాంతంలో భద్రత పెంచుతామని ప్రకటించారు.
బలోచిస్తాన్ స్వతంత్ర పోరాటానికి సంబంధించిన వార్తలు ప్రధానస్రవంతి మీడియాలో రానీయకుండా పాక్ సైన్యం, ఆ దేశపు ప్రభుత్వం అడ్డుకుంటున్నాయి. అయినా కొన్ని సంఘటనల గురించి బైటకు వివరాలు రాకుండా ఆపడం పాకిస్తాన్ వల్ల కావడం లేదు. తాజాగా జరిగిన ఈ దాడిలో మృతులు, గాయపడినవారి వివరాలు వెల్లడయ్యాయి. దాడి చీకట్లో జరిగిందని, భారీస్థాయిలో పరస్పర కాల్పులు జరిగాయని, గణనీయమైన సంఖ్యలోనే మరణాలు నమోదయ్యాయనీ స్థానిక పోలీసులు వెల్లడించారు.
బలోచిస్తాన్లో పాక్ సైన్యంపై దాడులు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. నవంబర్ 9న క్వెట్టా రైల్వేస్టేషన్లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ బాంబు పేలుడులో 31మంది జూనియర్ స్థాయి పాక్ సైనికులు చనిపోయారు, కనీసం 60మంది సైనికులు గాయపడ్డారు. ఆ దాడి తమ పనేనని బిఎల్ఎకు చెందిన మజీద్ బ్రిగేడ్ ప్రకటించింది. మరోవైపు బలోచ్ సాయుధ గ్రూపుల కూటమి ‘బలోచ్ రాజీ అజోయ్ సంగర్’ గత రెండు వారాల్లో 45 ప్రాంతాల్లో దాడులు చేసామని ప్రకటించింది. శుక్రవారం నాడు విడుదల చేసిన ఆ ప్రకటనలో తమ దాడుల్లో పాక్ మిలటరీని, వారి స్థావరాలనూ లక్ష్యం చేసుకున్నామని వెల్లడించింది. తమ దాడుల్లో ఒక మేజర్ సహా 20మంది సైనికులు హతమయ్యారని వివరించింది.
ఈ సంఘటన తర్వాత బలోచిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా నిలిపివేసామని పాకిస్తాన్ టెలికాం అథారిటీ ప్రకటించింది. ఆ ప్రాంతాల్లో భద్రతాకారణాల రీత్యా ఇంటర్నెట్ రావడం లేదని వివరించింది.