డాంకీ ప్యాలెస్ పేరుతో భారీ దోపిడీ చోటు చేసుకుంది. గాడిద పాల వ్యాపారం ప్రాంఛైజీల పేరుతో వందలాది మందిని నిలువునా దోచుకున్నారు. ఒక్కో ప్రాంఛైజీకి రూ. 5.50 లక్షల వసూలు చేశారు. ఇక ఒక్కో గాడిదను రూ. లక్షకు పైగా ఖర్చు పెట్టి కొనుగోలు చేశారు. ఇలా చాలా మంది రూ.5.5 లక్షల నుంచి 70 లక్షల వరకు మోసపోయారు.
తమిళనాడుకు చెందిన బాబు ఉలగనాథన్ ఈ కుంభకోణానికి తెరలేపాడు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతోపాటు, కర్ణాటక, తమిళనాడు రైతులను లక్ష్యంగా చేసుకుని కుంభకోణానికి తెరలేపాడు. తాను పెద్దగా చదువుకోలేదని, కానీ గాడిదల పాల వ్యాపారంలో కోట్లు సంపాదించానని, ఆడి కారులో తిరుగుతున్నానంటూ యూట్యూబ్‌లో వీడియోలు పెట్టి అమాయకులను ఆకర్షించాడు.
గాడిద ఫాం ఎలా నిర్వహించాలి, గాడిదలకు వైద్యం, షెడ్డులో పనిచేసే మనుషులను కూడా సరఫరా చేస్తామంటూ బాబు ఉలగనాథన్ చెప్పిన మాయమాటలకు జనం మోసపోయారు. గాడిద పాలను లీటరు రూ.1600 కొనుగోలు చేస్తామని, ప్రతి నెలా 5వ తేదీన బ్యాంకులో మీకు నగదు జమ చేస్తామంటూ మోసం చేశారు. ప్రతి రోజూ సేకరించిన పాలను నిల్వ చేసేందుకు భారీ ఫ్రిజ్‌లను ఏర్పాటు చేయించాడు. గాడిదలకు లక్షలు ఖర్చు చేసి ఫాంలు వేయించిన బాబు ఉలగనాథన్‌పై చెన్నైలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజీ పేరుతో రూ.100 కోట్ల భారీ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులు హైదరాబాద్‌లో ప్రెస్‌క్లబ్‌లో మీడియాకు విషయం చెప్పడంతో కుంభకోణం వెలుగులోకి వచ్చింది.