బలమైన విలువలు, కష్టపడే తత్వం ఉంటేనే దేశాభివృద్ధి అని వ్యాఖ్య
పనిగంటలపై ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి మరోసారి స్పందించారు. వారంలో ఆరు రోజులు పనిచేయాలని గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. భారతదేశ ఆర్థిక పురోభివృద్ధికి కష్టపడి పనిచేసే తత్వం, అంకితభావం అవసరమన్నారు. వారంలో ఐదు రోజుల పని విధానాన్ని తానెప్పుడూ అంగీకరించబోనని తేల్చి చెప్పారు.
సీఎన్బీసీ గ్లోబల్ లీడర్షిప్ సమ్మిట్లో మాట్లాడిన నారాయణమూర్తి, పనిగంటలపై తన అభిప్రాయాన్ని మార్చుకోనని స్పష్టం చేశారు. తుదిశ్వాస వరకు ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని తెలిపారు.
అలసిపోని అంకితభావానికి ప్రధాని మంత్రి నరేంద్రమోదీ ఓ నమూనా అన్నారు. బలమైన పని విలువలు లేని దేశం పోటీ ప్రపంచంలో వెనుకబడిపోతుందని అభిప్రాయపడ్డారు.
తన కెరియర్ మొత్తం సమయంతో సంబంధం లేకుండా పనిచేశానని గుర్తు చేసుకున్న నారాయణమూర్తి, వారానికి ఆరున్నర రోజులపాటు రోజుకు 14 గంటలు పనిచేసేవాడినని చెప్పారు. ఉదయం ఆరున్నర గంటలకు ఆఫీసుకు వెళ్తే మళ్లీ రాత్రి 8.40 గంటల వరకు పనిచేసినట్లు చెప్పారు. అందుకు తాను గర్విస్తున్నట్లు తెలిపారు.