సిక్కు వేర్పాటువాద నాయకుడు, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మరోసారి రెచ్చిపోయాడు. అయోధ్యలోని రామ మందిరం సహా హిందూ ఆలయాలను లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలకు తెగబడ్డాడు. నవంబర్ 16, 17న ‘హింసాత్మక హిందుత్వ భావజాలానికి పుట్టినిల్లు అయిన అయోధ్య పునాదులను పెకిలిస్తాం’ అని పెట్రేగిపోయాడు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రార్థనలు చేస్తున్న వీడియోను పన్నూన్ షేర్ చేశారు.
మరోవైపు హిందూ దేవాలయాలపై ఖలిస్తాన్ దాడులకు దూరంగా ఉండాలని కెనడాలోని భారతీయులను కోరిన పన్నూన్, గతంలోనూ ఇలాంటి హెచ్చరికలు చేశాడు. నవంబర్ 1 నుంచి 19 వరకూ ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దని , భారత్‌లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏళ్ళు కావొస్తున్న సందర్భంగా ఎయిర్ ఇండియా విమానాలపై దాడి జరిగే అవకాశం ఉందన్నాడు.
గతేడాది నవంబర్ లోనే ఇలాంటి బెదిరింపులే చేశాడు. దిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయాన్ని నవంబర్ 19న మూసివేస్తారన్నాడు . భవిష్యత్తులో ఆ విమానాశ్రయం పేరు కూడా మారుతుందని, ఇప్పుడు రామ మందిరం పునాదుల్ని పెకిలిస్తాం అంటూ ఇష్టానుసారం మాట్లాడాడు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశాడు.