ఏపీ ప్రభుత్వ సలహాదారు(నైతికవిలువలు)గా బాధ్యతలు చేపట్టనున్న చాగంటి కోటేశ్వరరావు
విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించే బాధ్యత ప్రభుత్వం తనకు అప్పగించడాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. పదవి విషయంలో తన అంగీకారం అధికారం కోసం కాదన్న చాగంటి, పిల్లలకు నాలుగు మంచి మాటలు చెప్పేందుకే ఒప్పుకున్నట్లు వివరించారు. తన వయసురిత్యా మరో ఐదారేళ్ళు ఆరోగ్యంగా పనిచేయగల్గే అవకాశం ఉన్నందున ప్రభుత్వం అప్పగించిన కర్తవ్యాన్ని సంతోషంగా అంగీకరించామన్నారు.
వేలమంది పిల్లలను ప్రభుత్వపరంగా కూర్చోబెడితే, తాను నాలుగు మంచిమాటలు చెబుతానన్నారు. తాను చెప్పే మాటలతో పిల్లలకు మేలు జరిగితే అంతకంటే సంతోషం ఏముంటుందన్నారు.
గురుస్థానం పరమ పవిత్రమైనదని, తల్లిదండ్రుల్లాగే గురువుకూ పిల్లవాడి అభిరుచి, నైపుణ్యం తెలుస్తాయని వివరించారు. గురువు చెప్పిన పాఠాలు పిల్లల మనసులో శాశ్వతంగా నిలుస్తాయన్నారు. ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయుల నడతను పిల్లలు బాగా గమనిస్తారన్నారు. నేర్చుకున్నదానిని సమాజహితం కోసం వినియోగించాలని వశిష్టుడు, విశ్వామిత్రుడు చెప్పినట్లు చెప్పగలిగితే మంచి ఫలితాలు ఉంటాయన్నారు.
ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును, ఎన్డీయే కూటమి ప్రభుత్వం రెండోవిడతలో ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో నైతిక విలువలు విభాగానికి సంబంధించి ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. కేబినెట్ ర్యాంక్ తో గౌరవించింది.