పారిస్ ఒలింపిక్స్ 2024లో అత్యంత వివాదాస్పదంగా నిలిచి, మహిళల బాక్సింగ్‌లో స్వర్ణపతకం గెలుచుకున్న అల్జీరియన్ బాక్సర్ ఇమానే ఖలీఫ్ మహిళ కాదు, పురుషుడే అని తేలింది. ఇమానే ఖలీఫ్ పురుషుడే అని నిర్ధారించిన మెడికల్ రిపోర్ట్ లీకైంది. దాంతో ఇమానే లింగ నిర్ధారణపై చర్చ మళ్ళీ మొదలైంది.
ఇమానే ఖలీఫ్‌ను మహిళల కోటాలో ఒలింపిక్స్ ఆడనివ్వడం మొదటినుంచీ వివాదాస్పదమైంది. ఆ విషయంపై ఒక ఫ్రెంచ్ జర్నలిస్ట్ పరిశోధన కొనసాగించారు. ఆ పరిశోధనలో ఇమానే మెడికల్ రిపోర్ట్ బైటపడింది. ఆ నివేదికలో ఇమానే ఖలీఫ్ శరీరంలో అంతర్గతంగా వృషణాలు ఉన్నాయని, డిఎన్ఎలో ఎక్స్-వై క్రోమోజోములు ఉన్నాయనీ తేలింది. ఇమానే శారీరక స్థితి ప్రకారం 5-ఆల్ఫా రెడక్టేజ్ ఇన్సఫిషియెన్సీ అనే లోపం ఉన్నట్లు తేలింది.
ఇమానే ఖలీఫ్ శరీరంలో ఇంటర్నల్ టెస్టికిల్స్ ఉండడం మాత్రమే కాదు, గర్భాశయం లేదని కూడా స్పష్టమైంది. ఎంఆర్ఐ స్కానింగ్‌లో ఇమానే ఖలీఫ్ శరీరంలో మైక్రోపెనిస్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. హార్మోన్ టెస్ట్‌లో కూడా ఖలీఫ్ శరీరంలో పురుషుల్లో ఉండే స్థాయిలో టెస్టోస్టిరాన్ ఉన్నట్లు వెల్లడైంది.
ఇమానే ఖలీఫ్ క్రీడాకారిణా లేక క్రీడాకారుడా అనే విషయంపై చాలాకాలం నుంచే వివాదం నడుస్తోంది. 2023లో న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్ గోల్డ్‌మెడల్ ఫైట్‌లో ఇమానే పాల్గొనకుండా ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ నిషేధం విధించింది.
తాజాగా మెడికల్ రిపోర్ట్ లీకై, ఇమానే ఖలీఫ్లో పురుష లక్షణాలు ఉన్నాయన్న సంగతి లీక్ అవడంతో, పారిస్ ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్‌లో ఇమానే గెలుచుకున్న స్వర్ణ పతకాన్ని ఉపసంహరించాలన్న డిమాండ్లు పెరిగాయి. భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తన ఎక్స్ ఖాతాలో ‘‘(ఇమానే) స్వర్ణ పతకాన్ని వెనక్కు తీసుకోండి, తనకు స్వర్ణం ఇవ్వడం సరైన నిర్ణయం కాదు’’ అని ట్వీట్ చేసాడు.