ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఒక హిందూ వ్యక్తి తన క్రైస్తవ భార్యకు విడాకులు ఇచ్చాడు. కారణం, ఆమె తన ధర్మాన్ని, హిందూ విశ్వాసాలనూ పదేపదే పరిహసిస్తూ అపహాస్యం చేస్తూండడమే. ఫ్యామిలీ కోర్ట్ అతని వాదనను సమర్థిస్తూ విడాకులు మంజూరు చేసింది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భార్య హైకోర్టులో కేసు వేసింది. అయితే భాగస్వామి మత విశ్వాసాలను అపహాస్యం చేయడాన్ని మానసిక క్రౌర్యంగా చెబుతూ హైకోర్టు, కిందిన్యాయస్థానం తీర్పును సమర్ధించింది.
నేహా అనే క్రైస్తవ మహిళ మధ్యప్రదేశ్ దిండోరీ జిల్లా కరంజియా వాస్తవ్యురాలు. ఆమె బిలాస్‌పూర్‌కు చెందిన వికాస్ చంద్ర అనే హిందూ వ్యక్తిని 2016 ఫిబ్రవరి 7న హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్ళి చేసుకుంది. అయితే వారిద్దరికీ మొదటినుంచీ పొసగలేదు. భర్త హిందూ విశ్వాసాలను పాటించడానికి వ్యతిరేకించడం మాత్రమే కాక, ఆమె తన భర్త విశ్వాసాలను, హిందూ దేవీ దేవతలనూ అపహాస్యం చేస్తూ ఉండేది. దాంతో వారిద్దరి మధ్యా భేదాభిప్రాయాలు పెరిగిపోయాయి.
దంపతులు మొదట్లో ఢిల్లీలో నివసించేవారు. అయితే కొన్నాళ్ళకే ఆమె బిలాస్పూర్ వెళ్ళిపోయింది. అక్కడ సెయింట్ జేవియర్స్ స్కూల్లో టీచర్‌గా చేరింది. చర్చికి వెళ్ళడం, క్రైస్తవ మత పద్ధతులను పాటించడం మళ్ళీ మొదలుపెట్టింది.
మొదటినుంచీ హిందూధర్మంపై అమిత విశ్వాసం కలిగి ఉన్న వికాస్, తన భార్య ప్రవర్తనతో ఒత్తిడికి, ఆందోళనకూ లోనయ్యాడు. తన మత పద్ధతులను గౌరవించాలంటూ పదేపదే విజ్ఞప్తులు చేసాడు. అయితే నేహా ఎంతమాత్రం ఒప్పుకోలేదు. హిందూ ఆచారాలను అనుసరించడానికి నిరాకరించడమే కాక, వాటిని అవహేళన చేయడం కొనసాగించింది. తన విశ్వాసాల ప్రకారం చర్చికి వెళ్ళడం మానలేదు. ఆ ఒత్తిడిని తట్టుకోలేని వికాస్, న్యాయజోక్యం కోసం ప్రయత్నించాడు. నేహా చర్యలను మానసిక క్రౌర్యంగా పరిగణిస్తూ ఫ్యామిలీ కోర్టు విడాకులు 2024 ఏప్రిల్ 5న మంజూరు చేసింది. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నేహా హైకోర్టును ఆశ్రయించింది.
హైకోర్టు విచారణలో, తమ వైవాహిక జీవితంలో ఎప్పుడూ హిందూ ఆచారాలను పాటించలేదని నేహా స్పష్టం చేసింది. తను చర్చికి వెళ్ళడానికే ప్రాధాన్యం ఇచ్చానని నిర్ధారించింది. ఆమె చర్యలు తన మతపరమైన సెంటిమెంట్లను అవమానించాయని, తమ వైవాహిక సంబంధం బీటలువారిందనీ వికాస్ చెప్పుకొచ్చాడు.
జస్టిస్ రజనీ దూబే, జస్టిస్ సంజయ్ జైస్వాల్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆ కేసును విచారించింది. ఇరుపక్షా వాదనలూ విన్న న్యాయమూర్తులు తుదితీర్పునిచ్చారు. హిందూ మతపరమైన ఆచారాల్లో భార్యాభర్తలిద్దరూ కలిసి పాల్గొనడం తప్పనిసరి అయిన వైవాహిక విధి అని వారు స్పష్టం చేసారు. దానికి ఉదాహరణలను మహాభారతం నుంచి, మనుస్మృతి నుంచీ ఉటంకించారు. ‘‘భార్య తన మతాచారాల్లో తనతో కలిసి పాల్గొనాలని భర్త ఆశించడం హిందూ సంప్రదాయంలో భాగమే. దానికి నిరాకరించడం, అతని విశ్వాసాలను అపహాస్యం చేస్తూ అవమానకరంగా మాట్లాడడం అనేది మానసిక క్రౌర్యం కిందకు వస్తుంది’’ అని న్యాయమూర్తులు నిర్ధారించారు. నేహా చర్యలు ఆమె భర్తను ఒంటరివాణ్ణి చేసాయనీ, అతన్ని మానసికంగా కుంగదీసాయనీ హైకోర్టు తేల్చింది. వారికి విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది.
హైకోర్టు తన తుది వ్యాఖ్యల్లో, వైవాహిక సంబంధాన్ని సామరస్యంగా ఉంచడానికి భాగస్వామి విశ్వాసాలపై గౌరవం, మతసహనం అనేవి పునాదులని స్పష్టం చేసింది. వికాస్, నేహాల పెళ్ళి హిందూ ఆచార పద్ధతిలో జరిగిన సంగతిని గుర్తు చేస్తూ అతని మతాచారాలకు గౌరవం ఉండాలని వికాస్ ఆశించడంలో తప్పు లేదనీ, దానికి నేహా నిరాకరించడమే కాక అవహేళన చేయడం అతన్ని మానసికంగా హింసించడమేననీ అభిప్రాయపడింది.