మధ్యప్రదేశ్లో ఏనుగులు మృత్యువాత ఆందోళన కలిగిస్తోంది. ఎంపీలోని బాంజద్గఢ్ టైగర్ రిజర్వ్ పార్కులో గడచిన మూడు రోజుల్లోనే పది ఏనుగులు చనిపోయాయి. విషాహారం తినడం వల్లే ఏనుగులు మృత్యువాత పడి ఉంటాయని అనుమానిస్తున్నారు. మూడు రోజుల కిందట 7 ఏనుగులు చనిపోగా, తాజాగా మరో మూడు మృత్యువాత పడ్డాయి. దీంతో ఎంపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
ఏనుగులు మృత్యువాతపడిన ప్రాంతాలను మధ్యప్రదేశ్ చీఫ్ కన్వర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ అంబాదే పరిశీలించారు. విషాహారం తినడం వల్లే ఒకేసారి పది ఏనుగులు చనిపోయినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలను రప్పిస్తున్నట్లు ప్రకటించారు. ఏనుగుల రక్త నమూనాలు పరీక్షించిన తరవాత వాటి మృత్యువాతపై స్పష్టత రానుంది.
మూడు రోజుల్లో పది ఏనుగులు చనిపోవడం దేశంలో ఇదే మొదటిసారని అంబాదే ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వు ఫారెస్టులోకి విషాహారం ఎలా చేరిందనే దానిపై విచారణ సాగుతోంది. ప్రస్తుతం ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులను, వస్తువులను గుర్తించలేదని ఆయన తెలిపారు. ఏనుగుల మృత్యువాతపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత రానుంది.