భారత స్టాక్ మార్కెట్లో ఐపీవోల సందడి కొనసాగుతోంది. గడచిన పది మాసాల్లోనే రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. 2021లో గరిష్ఠంగా లక్షా 18 వేల కోట్లు సేకరించారు. ఆ రికార్డు నేడు బద్దలైంది. పది మాసాల్లోనే లక్షా 22 వేల కోట్ల పెట్టుబడులు ఐపీవోల ద్వారా రాబట్టారు. ఆగష్టులో రూ.17,109 కోట్లు, సెప్టెంబరులో రూ.11058 కోట్లు, అక్టోబరులో రూ.38,700 కోట్ల నిధులు సమకూర్చుకున్నారు. నవంబరులో స్విగ్గీ, సగలిటీ ఇండియా, నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్, ఏసీఎంఈ సోలార్ హోల్డింగ్స్ కంపెనీలు రూ.19 వేల కోట్లు పైగా సమీకరించనున్నాయి.
ఈ ఏడాది వచ్చిన ఐపీవోల్లో కొన్ని నిరాశ పరచగా కొన్ని లాభాలు పంచాయి. అతిపెద్ద ఐపీవో హ్యూందాయ్ డిస్కౌంటుతో లిస్టైంది. వారీ ఎనర్జీస్ మదుపరులకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. దిలీప్ కన్స్ట్రక్షన్స్ 20 శాతం నష్టాల్లో ట్రేడవుతోంది. సగానికిపైగా ఐపీవోలు లాభాలు తెచ్చిపెట్టాయి. అయితే స్టాక్ మార్కెట్లలో సెంటిమెంట్ బలహీనంగా ఉండటంతో విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకున్నారు. వీరి ప్రభావం రాబోయే ఐపీవోలపై పడే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు.
మెటల్ మార్కెట్లలో పెరుగుతోన్న పెట్టుబడులు, ఇన్వెస్టర్ల ఆసక్తి చూపుతున్నాయి. స్టాక్ మార్కెట్లు ఇప్పటికే గరిష్ఠాలకు చేరడంతో, లాభాలు స్వీకరించి విలువైన లోహాలైన బంగారం, వెండిలో పెట్టుబడులు పెడుతున్నారని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. గడచిన రెండు వారాల్లోనే 10 గ్రాముల బంగారం రూ. 3 వేలు, కిలో వెండి రూ. 12 వేల ధర పెరిగింది.అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్సు గోల్డ్ 2787 యూఎస్ డాలర్లకు ఎగబాకింది. వెండి కిలో లక్షా 3 వేలు దాటిపోయింది. క్రూడాయిల్ ధరలు దిగివచ్చాయి. డాలరుతో రూపాయి మారకం స్థిరంగా కొనసాగుతోంది.