దేశంలో ఎక్కడ ఏ ప్రకృతి విపత్తు వాటిల్లినా లేక ప్రమాదం జరిగినా తక్షణం సహాయం చేయడానికి ముందుండేది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలే అన్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఒడిషాను వణికించిన దానా తుపాను సమయంలో కూడా ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు వేగంగా స్పందించి సహాయకచర్యల్లో పాల్గొన్నారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో స్వయంసేవకులు సేవాభారతి, ఉత్కళ్ విపన్న సహాయతా సమితి సంస్థలతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టారు. సంఘ్ ఒడిషా పూర్వప్రాంత ప్రచార్ ప్రముఖ్ సుమంత్ కుమార్ పాండా ఆ వివరాలు చెప్పుకొచ్చారు.
జగత్సింగ్పూర్ జిల్లాలోని పారాదీప్; కేంద్రపర జిల్లాలోని మహాకాలపద, రాజ్‌నగర్, రాజ్కనిక; భద్రక్ జిల్లాలోని చాంద్‌బాలి ప్రాంతాల్లో తుపాను తీవ్ర ప్రభావం చూపించింది. అక్కడ స్వయంసేవకులు బాధితులకు ఆహారం పంచారు; రహదారులు క్లియర్ చేసారు; పడిపోయిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించారు. ఇంకా వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టారు.
దానా తుపాను వల్ల భద్రక్, కేంద్రపర జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అక్కడ 482 మంది స్వయంసేవకులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తుపాను ఒడిషాలో తీరం దాటుతుందన్న సంగతి తెలిసిన వెంటనే సంఘ్ కార్యకర్తలు కార్యాచరణలోకి దిగేసారు.
తుపాను ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసిన స్వయంసేవకులు మొత్తం 11 జిల్లాల్లో 169 బృందాలు ఏర్పాటు చేసాయి. 2044 మంది కార్యకర్తలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒక్కో బృందంలో 170 మంది స్వయంసేవకులతో ఏర్పాటైన 12 బృందాలను కేంద్రపర జిల్లాకు పంపించారు. మరో 312 మంది కార్యకర్తలతో 11 బృందాలు భద్రక్ జిల్లా వెళ్ళాయి. 425 మంది కార్యకర్తలు 43 బృందాలుగా బాలాసోర్ చేరుకున్నారు. జగత్సింగ్పూర్ జిల్లాలో 92మంది సభ్యులున్న 9 బృందాలు, భువనేశ్వర్‌లో 70మంది కార్యకర్తలతో కూడిన 16 బృందాలు, ఖోర్ద్దా జిల్లాలో 215మంది కార్యకర్తలతో కూడిన 13 బృందాలు, పూరీ జిల్లాలో 105 మంది స్వయంసేవకుల 15 బృందాలు, కెండుఝార్ జిల్లాలో 159 మంది స్వయంసేవకులతో కూడిన 18 బృందాలు, రాయ్‌రంగపూర్ జిల్లాలో 108 మంది కార్యకర్తలున్న 14 బృందాలు, మయూర్భంజ్ జిల్లాలో 156 మంది కార్యకర్తలతో 16 బృందాలు, జాజ్‌పూర్ జిల్లాలో 232మంది సంఘ్ కార్యకర్తలతో కూడిన 13 బృందాలు, గంజాం జిల్లాలో 14మంది స్వయంసేవకుల బృందం ఒకటి సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. అవసరమైనప్పుడు తక్షణ స్పందన కోసం ఆ బృందాలన్నీ అప్రమత్తంగా ఉన్నాయి.
తుపాను తీరం దాటడానికి ముందే కార్యకర్తలు స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుని, రానున్న విపత్తు గురించి అవగాహన కల్పించారు. కేంద్రపర, భద్రక్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల నుంచి బాధిత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సంఘ్ కార్యకర్తలు నిద్రాహారాలు లేకుండా పనిచేసారు. ఆ పనిలో వారు జిల్లా అధికారులకు సహకరించి ప్రజలను జాగ్రత్తగా సురక్షిత ప్రదేశాలకు తరలించారు. రహదారుల మీద విరిగిపడిన చెట్లను, కరెంటు స్తంభాలను తొలగించారు. తుపాను సమయంలోనూ, తర్వాతా బాధితులకు ఆహారం, తాగునీరు, అత్యవసరమైన మందులు పంచారు. సంఘ్ స్వయంసేవకుల నిరంతరాయమైన సేవ, కష్టకాలంలో సమాజం పట్ల వారి నిబద్ధతను మరోసారి చాటిచెప్పింది.