ఆంధ్రప్రదేశ్‌లో ఈ యేడాది ఖరీఫ్ సీజన్లో రాయలసీమ పరిధిలోని 5 జిల్లాల్లో 54 మండలాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నైఋతి ఋతుపవనాల సీజన్లో (జూన్-సెప్టెంబర్) రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 574.7 మిల్లీమీటర్లు, గరిష్టంగా 681.6మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయినా కొన్ని మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం లేదా వర్షాలు లేని పరిస్థితులు నమోదయ్యాయి.
కేంద్ర వ్యవసాయ శాఖ కరువు మాన్యువల్ ప్రకారం రెండు తప్పనిసరి సూచికలు, (వర్షపాతం, పొడిబారిన పరిస్థితులు), నాలుగు ప్రభావశీల సూచికలు (వ్యవసాయ పంట విస్తీర్ణం, రిమోట్ సెన్సింగ్, భూమిలో తేమ, హైడ్రాలజీ), క్షేత్రస్థాయి వాస్తవాలతో కూడిన జిల్లా కలెక్టర్ నివేదిక నియమాల ప్రకారం 2024 ఖరీఫ్‌లో 27 మండలాల్లో తీవ్ర కరవు, 27 మండలాల్లో మధ్యస్థ కరవు ప్రకటించారు.
కర్నూలు జిల్లాలో కౌతాళం, పెద్దకడుబూరు మండలాల్లో మధ్యస్థ కరవు ఉంది. అనంతపురం జిల్లా నార్పల, అనంతపురం మండలాల్లో తీవ్ర కరవు నమోదైంది. అనంతపురం జిల్లా విడపనకల్లు, యాడికి, గార్లెదిన్నె, బీకే సముద్రం,రాప్తాడు మండలాల్లో మధ్యస్థ కరవు నమోదయింది.
శ్రీ సత్యసాయి జిల్లాలో తాడిమర్రి, ముదిగుబ్బ, తలుపుల.. ఈ మూడూ తీవ్ర కడుపు మండలాలుగా ప్రకటించారు. కనగానిపల్లి, ధర్మవరం, నంబులపూలకుంట, గాండ్లపెంట, బుక్కపట్నం, రామగిరి, పరిగి ప్రాంతాలను మధ్యస్థ కరవు మండలాలుగా ప్రకటించారు.
అన్నమయ్య జిల్లాలో గాలివీడు, చిన్నమండె, సంబేపల్లి, టి.సుందరపల్లె, రాయచోటి,లక్కిరెడ్డిపల్లె, రామాపురం, వీరబల్లె, తంబళ్లపల్లె, గుర్రంకొండ, కలకాడ, పీలేరు, కలికిరి, వాల్మీకిపురం, కురబలకోట, పెద్దతిప్పసముద్రం, బి.కొత్తకోట, మదనపల్లె, నిమ్మనపల్లె అనే 19 మండలాలనూ తీవ్ర కరవు మండలాలుగా ప్రకటించారు.
చిత్తూరు జిల్లాలో పెనుమూరు, యాదమరి, గుడిపాల మండలాలను తీవ్ర మండలాలుగానూ…. శ్రీరంగరాజపురం, చిత్తూరు, శాంతిపురం, రొంపిచర్ల, పూతలపట్టు, సోమల, పుంగనూరు, పలమనేరు, బైరెడ్డిపల్లి, వెంకటగిరికోట, గుడుపల్లె, కుప్పం, రామకుప్పం మొత్తం 13 మధ్యస్థ కరవు మండలాలు ఉన్నాయని ప్రకటించారు.