ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపర్వంత్ సింగ్ పన్నూ మరోసారి హెచ్చరికలు జారీ చేశాడు. దేశంలో సీఆర్పీఎఫ్ పాఠశాలలన్నీ మూసివేయాలని లేదంటే తీవ్ర పరిణామాలుంటాయంటూ అమెరికా నుంచి హెచ్చరికలు చేశాడు. ఢిల్లీలో గత వారం సీఆర్పీఎఫ్ పాఠశాల సమీపంలో పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. ఆ తరవాత దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న సీఆర్పీఎఫ్ పాఠశాలల వద్ద నిఘా సంస్థలు తనిఖీలు నిర్వహించారు. తాజాగా పన్నూ హెచ్చరికల నేపథ్యంలో సీఆర్పీఎఫ్ పాఠశాలలకు భద్రత పెట్టారు.
1984లో స్వర్ణదేవాలయంపై దాడి, సిక్కుల ఊచకోతలో సీఆర్పీఎఫ్ మనుషులను సమకూర్చిపెట్టిందని పన్నూ హెచ్చరికల్లో పేర్కొన్నాడు. సీఆర్పీఎఫ్ మాజీ అధిపతి గిల్ అనేక అకృత్యాలకు పాల్పడ్డాడని పన్నూ ఆరోపించారు. నిజ్జర్ హత్యకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సీఆర్పీఎఫ్ సహాయంతో కుట్ర అమలు చేశారంటూ పన్నూ చేసిన తాజా హెచ్చరికలు చర్చకు దారితీశాయి.
ఢిల్లీలోని రోహిణి ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ పాఠశాల వద్ద గత వారం జరిగిన పేలుడుకు తామే బాధ్యలమంటూ జస్టిస్ లీగ్ ఇండియా అనే ఖలిస్థానీ అనుకూల గ్రూపు ప్రకటించింది. ఖలిస్థానీ వేర్పాటువాదులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ పేలుడుకు పాల్పడినట్లు నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. కొందరు గూండాలతో మా నోరు మూయించాలని చూస్తే అది వారి మూర్ఖత్వమే అవుతుందని వేర్పాటు వాదులు హెచ్చరించారు. వారికి మేం ఎంతో సమీపంలో ఉన్నాం. మేం తలుచుకుంటే వారిపై ఏక్షణంలోనైనా దాడి చేయగలమనే సందేశం పంపించారు. ఖలిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
ఢిల్లీ పేలుడు ఘటనపై నిఘా సంస్థలు విచారణ ప్రారంభించాయి. సీసీటీవీ ఫుటేజీ సేకరించారు. తెల్లని వస్త్రాలు ధరించిన ఓ వ్యక్తి అక్కడ సంచరించినట్లు వీడియోల ద్వారా గుర్తించారు. నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు.