కాంగ్రెస్ పార్టీ ప్రథమ కుటుంబపు రెండో వారసురాలు ప్రియాంకా గాంధీ ఎట్టకేలకు ఎన్నికల రేసులో కాలు పెట్టేసారు. సోదరుడు రాహుల్ వదిలేసిన కేరళలోని వయనాడ్ ఎంపీ సీటుకు జరుగుతున్న ఉపయెన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసారు. ఆ సమయంలో ఆమె దాఖలు చేసిన అఫిడవిట్‌ను బట్టి పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రియాంక, ఆమె భర్త రాబర్ట్ వాద్రా భారీగా సంపాదించిన ఆస్తుల వివరాలు బైటపడ్డాయి. ఆ ఆస్తుల ఆర్జనలో అవినీతి పద్ధతుల గురించి అనుమానాలు తలెత్తుతున్నాయి.
అఫిడవిట్లో దాఖలు చేసిన వివరాల ప్రకారం, రాబర్ట్ వాద్రా ఆదాయం గత నాలుగేళ్ళలో 55 లక్షల నుంచి 15 లక్షలకు పడిపోయింది, ప్రియాంక ఆదాయం మాత్రం పెరిగింది. ఆమె ఆస్తిలో రూ.7.74 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ.4.24 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. ఆమె మీద రెండు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. పన్ను మదింపు ప్రొసీడింగ్స్ కూడా ఇంకా సాగుతున్నాయి.
ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా ఆదాయం 2019-20లో రూ.55.58 లక్షలు ఉంటే, 2020-21లో రూ.11.38లక్షలకు, 2021-22లో రూ.9.03 లక్షలకు పడిపోయింది. 2022-23లో రూ.9.35లక్షలకు తర్వాత 2023-24లో 15.09 లక్షలకు పెరిగింది. మొత్తం మీద గత నాలుగేళ్ళలో ఆయన ఆదాయం రూ.40లక్షలు తగ్గిపోయింది.
అదే సమయంలో ప్రియాంక ఆదాయం దాదాపు పెరుగుతూనే ఉంది. 2019-20లో ప్రియాంక ఆదాయం రూ.69 లక్షలు ఉంటే, 2020-21లో రూ. 19.81లక్షలకు తగ్గింది. 2021-22లో రూ.45.56 లక్షలు, 2022-23లో రూ.47.21 లక్షలు, 2023-24లో రూ.46.39లక్షలుగా ఉంది. ప్రియాంకకు మూడు బ్యాంక్ అకౌంట్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు, పిపిఎఫ్ ఖాతా, భర్త కానుకగా ఇచ్చిన హోండా కారు, రూ1.15కోట్ల విలువ చేసే బంగారం ఉన్నాయి. స్థిరాస్తుల్లో వారసత్వంగా వచ్చిన న్యూఢిల్లీ మెహ్రౌలీలోని వ్యవసాయ భూమిలో సగం వాటా, ఫామ్‌హౌస్‌లో సగం వాటా ఉన్నాయి. సిమ్లాలో సుమారు 6 కోట్ల విలువైన నివాసం పూర్తిగా ఆమె పేరు మీదనే ఉంది. ఆమెకు అప్పులు రూ.15.75 లక్షలు ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇంక 2012-13 సంవత్సరానికి ఆదాయపుపన్ను రీఅసెస్మెంట్ ప్రొసీడింగ్స్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఆమె ఇంకా రూ.15లక్షల పన్ను కట్టవలసి ఉందని అఫిడవిట్ చెబుతోంది.
ప్రియాంకాగాంధీ ఆస్తులు, ఆదాయ వివరాలపై బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ అనుమానాలు వ్యక్తంచేసారు. ప్రియాంకకు ఆదాయమార్గం ఏమిటని ఆయన అడిగారు. భారతదేశపు షేర్‌మార్కెట్‌ను ప్రియాంక దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. భర్త రాబర్ట్ వాద్రా భూముల కుంభకోణాల్లో ప్రియాంకకు కూడా ప్రమేయం ఉందా అని ప్రశ్నించారు. ప్రియాంక తన అఫిడవిట్లో తప్పుడు గణాంకాలు చూపించారని ఆరోపించారు. 2013లో హర్యానాలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాబర్ట్ వాద్రా ఎన్నో ఎకరాల భూమిని నామమాత్రపు ధరలకు కొనుగోలు చేసారనీ, వాటివిలువ ఇప్పటికి కనీసం ఐదురెట్లయినా పెరిగిందనీ ప్రదీప్ చెప్పారు. రాబర్ట్ వాద్రా న్యూఢిల్లీలో కూడా ల్యాండ్ డీలింగ్స్ చేసారని గుర్తు చేసారు. కాబట్టి, ప్రియాంక అఫిడవిట్లో చెప్పినదానికంటె ఆమె ఆస్తులు, ఆదాయాల విలువ మరింత ఎక్కువగా ఉంటుందని ఆరోపించారు.
ప్రియాంక-రాహుల్ గాంధీ షేర్‌మార్కెట్‌ను దుర్వినియోగం చేసారని చాలా ఆరోపణలున్నాయి. 2022 ఆదాయపు పన్ను మదింపు ఉత్తర్వుల్లో ఈ విధంగా పేర్కొన్నారు… ‘యంగ్ ఇండియా పత్రిక యాజమాన్యమైన అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ సంస్థలో మెజారిటీ షేర్‌హోల్డర్‌గా ఉన్న ప్రియాంకా గాంధీ అదనంగా 26,244 షేర్లు కొనుగోలు చేసారు. అయితే ఆ వ్యవహారంలో కంపెనీల చట్టం నియమనిబంధనలను అనుసరించలేదు’. అయితే ఆ షేర్లను ప్రియాంకా గాంధీ తన అఫిడవిట్లో చూపించలేదు. మరి ఆ షేర్లు ఎక్కడికి వెళ్ళాయి? వాటి విలువ ఎంత? అన్న సందేహాలు కలుగుతున్నాయి.
మరోవైపు, ఆదాయపు పన్ను శాఖకు గత కొన్నేళ్ళుగా బకాయిలు, జరిమానాల రూపంలో ప్రియాంకా గాంధీ ఇప్పటికి రూ.76కోట్లు చెల్లించవలసి ఉంది. ఆదాయపు పన్ను బకాయిలే అంత ఉంటే, ఆదాయం ఎంత ఉండి ఉండాలి? దానికీ, ఎన్నికల అఫిడవిట్లో చూపించిన ఆదాయానికీ పొంతన కుదరడం లేదు.