పుణే టెస్టు తొలి రోజు ఆటలో భారత స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. వాషింగ్టన్ సుందర్, అశ్విన్ లు పదికి పది వికెట్లు పడగొట్టి న్యూజీలాండ్‌ను ఆలౌట్ చేశారు. వాషింగ్టన్ సుందర్(7/59) రాణించగా, రవిచంద్రన్ అశ్విన్(3/64) తనవంతుగా న్యూజీలాండ్ బ్యాటర్లను ఇరకాటంలో పడేశాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన కివీస్ తొలిరోజు ఆటలో 79.1 ఓవర్లు ఆడి పది వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. ఓపెనర్ డేవాన్ కాన్వే (76), రచిన్ రవీంద్ర (65) మరోసారి ఆకట్టుకున్నాడు. మిచెల్ శాంట్నర్ (33), టామ్ లాథమ్ (15), విల్ యంగ్ (18), డారిల్ మిచెల్ (18) విఫలం అయ్యారు. టామ్ బ్లండెల్ (3), గ్లెన్ ఫిలిప్స్ (9) ను భారత స్పిన్నర్లు కట్టడి చేశారు.
కివీస్ విధించిన 259 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రోహిత్ శర్మ డకౌట్ గా వెనుదిరిగాడు. టిమ్ సౌథీ వేసిన 2.6 బంతిని ఆడబోయి బౌల్డ్ ఆడాడు. దీంతో భారత్ స్కోర్ బోర్డు ఒక పరుగు వద్ద ఉన్నప్పుడు తొలి వికెట్ నష్టపోయింది. ప్రస్తుతం క్రీజులో యశస్వీ జైస్వాల్(6), శుభమన్ గిల్(10) ఉన్నారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 11 ఓవర్లు ఆడి ఒక వికెట్ నష్టపోయి 16 పరుగులు చేసింది.