రష్యా కజాన్‌లో నిర్వహించిన బ్రిక్స్ సదస్సులో భాగస్వామ్య దేశాల మధ్య సామూహిక, ద్వైపాక్షిక సమావేశాలు జరిగాయి. ఈ సంవత్సరం బ్రిక్స్ గ్రూప్‌లోకి కొత్తగా మరికొన్ని దేశాలను చేర్చారు. సభ్య దేశాల మధ్య పటిష్టమైన ఆర్థిక సహకారం సాధించాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు.
బ్రిక్స్ సభ్యదేశాల ప్రతినిధులు కజాన్‌లోని ఎక్స్పో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో సమావేశమయ్యారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వారిని ఆహ్వానించారు.
న్యారో-ఫార్మేట్ మీటింగ్‌లో సభ్యదేశాల అధినేతలు అందరూ పాల్గొన్నారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్ సిసి, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, చైనా అధ్యక్షుడు షి జింపింగ్, యుఎఇ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నాహ్యా, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా, బ్రెజిల్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మువురో వియెరా ఆ సమావేశానికి హాజరయ్యారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రసంగంతో సభ మొదలైంది. తర్వాత దేశాల అధినేతలు పరస్పర ఆర్థిక సహకారం గురించి, బ్రిక్స్ల్ మరిన్ని దేశాలను సభ్యులుగా చేర్చుకోవాలనీ నిర్ణయించారు. పుతిన్ తన ప్రసంగంలో 2024-25 సంవత్సరానికి బ్రిక్స్ దేశాల సగటు ఆర్థికాభివృద్ధి 3.8శాతానికి చేరుకుంటుందని చెప్పారు. సాంకేతికత, విద్య, వనరుల నిర్వహణ, వాణిజ్యం తదితర రంగాల్లో మరింత సమన్వయంతో పనిచేయడం వల్ల సభ్య దేశాల ఆర్థిక వ్యవస్థలను పూర్తిగా వినియోగించుకోగలమని పుతిన్ స్పష్టం చేసారు. అలాగే, బ్రిక్స్ ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్ ఏర్పాటుకు ప్రతిపాదించారు.
బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా వీడియో లింక్ ద్వారా హాజరయ్యారు. అంతర్జాతీయ ప్రకృతివనరుల విపణిలో బ్రిక్స్ దేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ప్రపంచంలోని రేర్ఎర్త్ మెటల్స్‌లో 72శాతం బ్రిక్స్ దేశాల్లోనే ఉన్నాయని వివరించారు. పరస్పర సహకారం కోసం ఏకీకృత బ్రిక్స్ ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ‘‘భాగస్వామ్య దేశాల మధ్య ప్రత్యామ్నాయ ఆర్థిక లావాదేవీలు జరగాలి. దానర్ధం మన జాతీయ నగదులను తీసివేయాలని కాదు. ఒక కొత్త ఆర్థిక వ్యవస్థను సృష్టించుకోవాలి. ఆ దిశగా తీవ్రంగా ఆలోచించాలి’’ అని డ సిల్వా ప్రతిపాదించారు.
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ బ్రిక్స్ దేశాల మధ్య కొత్త ఇంధన రవాణా నెట్వర్క్ అభివృద్ధి చేసుకోవాలని ప్రతిపాదించారు. అంతర్జాతీయ రవాణా మార్గాలకు కేంద్రస్థానంగా ఇరాన్ వ్యూహాత్మక స్థానంలో ఉందని గుర్తు చేసారు.
ఈ సమావేశాల సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. గల్వాన్ లోయ ఘటన జరిగాక, ఐదేళ్ళ తర్వాత ఇరుదేశాల అధినేతలూ ముఖాముఖీ సమావేశం అవడం ఇదే మొదటిసారి. ఆ సందర్భంలో మాట్లాడుతూ సరిహద్దుల వద్ద శాంతి సుస్థిరతలు కొనసాగించడానికే ప్రాధాన్యం ఇవ్వాలని మోదీ పిలుపునిచ్చారు. మిగతా దేశాల అధినేతలతోనూ మోదీ చర్చలు జరిపారు.
బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్‌డిబి) అధ్యక్షుడు దిల్మా రౌసెఫ్ తమ నివేదికను సదస్సుకు సమర్పించారు. జాతీయ కరెన్సీల్లో బ్రిక్స్ ఫైనాన్సింగ్‌లో 28.3శాతం ఎన్‌డిబి ద్వారానే జరుగుతోందన్నారు.
చివరిగా బ్రిక్స్ దేశాధినేతలు కజాన్ డిక్లరేషన్‌ను ఆమోదించారు.
‘ప్రపంచదేశాల సమాన అభివృద్ధి, భద్రత కోసం బహుళత్వ విధానాన్ని బలపరచాలి’ అనే నినాదంతో జరిగిన 16వ బ్రిక్స్ సమావేశాలు ముగిసాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాత్రికి ఢిల్లీ చేరుకున్నారు.