దక్షిణ భారతదేశం నుంచి దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన సూపర్‌స్టార్‌గా రజినీకాంత్‌కు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. రాజకీయ భిన్నాభిప్రాయాలకు అతీతంగా రజినీకాంత్‌ని అభిమానించేవారు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. అయితే ఇటీవల రజినీకాంత్ సినిమాలు చూస్తుంటే, ఉద్దేశపూర్వకంగా సమాజంలో కొన్ని వర్గాల మధ్య చిచ్చురేపే ప్రయత్నాలు చేసే దర్శకులు చెప్పినట్టు ఆడుతున్నాడన్న ఆవేదన చాలామందిలో కలుగుతోంది. ప్రత్యేకించి, తటస్థమార్గాన్ని అనుసరించే తమిళ ప్రజలు, రజినీకాంత్ ద్రవిడవాద ప్రచారకుల చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడా అని ఆవేదన చెందుతున్నారు. కాలా, కబాలి తర్వాత ఇప్పుడు వేట్టయన్ సినిమాతో ఆయన అభిమానులైన వారు సైతం విసిగిపోయారు.
అప్పుడప్పుడూ సనాతన ధర్మం గురించి గొప్పగా మాట్లాడుతూ ఉండే రజినీకాంత్, పూర్తిగా ద్రవిడవాదాన్ని తలకెత్తుకునే ప్రధానస్రవంతి తమిళ సినిమాల్లో భాగమైపోవడం చారిత్రక విషాదం. సనాతనధర్మాన్ని అనుసరించే వాడినని చెప్పుకునే రజినీకాంత్ ఇప్పుడు ద్వేషాన్ని ప్రచారం చేసే భావజాలానికి ప్రతినిధిగా మారిపోవడం బాధాకరం. దానికి ప్రస్తుత ఉదాహరణ టిజె జ్ఞానవేల్ తాజా సినిమా వేట్టయన్.
జ్ఞానవేల్ రాజాని ‘లై భీమ్’ దర్శకుడు అనడానికి కారణం ఉంది. తన సినిమా ‘జై భీమ్’ ద్వారా వివిధ కులాల మధ్య అగాధం సృష్టించేలా తప్పుడు ప్రచారం చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిపోయినవాడు జ్ఞానవేల్. ఆ సినిమా ఒక గిరిజనుడి కస్టోడియల్ మరణం గురించిన కథ. ఆ గిరిజనుడి చావుకి కారణమైన సబ్‌ఇనస్పెక్టర్‌ను వన్నియార్ కులానికి చెందినవాడిగా చూపిస్తాడు దర్శకుడు. కథానాయకుడు సూర్యకు నిజజీవిత పాత్ర అయిన జస్టిస్ కె చంద్రు పేరు పెట్టిన జ్ఞానవేల్, దుర్మార్గుడైన సబ్‌ఇనస్పెక్టర్ పాత్ర నేపథ్యాన్ని మార్చేసాడు. నిజజీవితంలో క్రైస్తవుడై ఉండి దళితుడిగా చెప్పుకునే సబ్ ఇనస్పెక్టర్‌ను సినిమాలో వన్నియార్‌గా మార్చి చూపించాడు. ఆ సినిమా విడుదల అయినప్పుడు, అనవసరంగా రెచ్చగొట్టడానికి దర్శకుడు ప్రయత్నించాడంటూ వన్నియార్ కులస్తులు ఖండించారు. అదే సినిమాలో మరో దృశ్యంలో సూర్య పాత్ర బ్రాహ్మణులు నమ్మదగినవారు కాదు అని సూచించేలా ప్రవర్తిస్తుంది. అలా, కొన్ని కులాలవారు దుష్టులు అని ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు ఆడడం జ్ఞానవేల్ రాజాకు పరిపాటిగా మారింది. అందుకే అతన్ని ‘లై భీమ్ దర్శకుడు’ అంటారు.
డబ్బుల కోసం అలాంటి దర్శకుడి సినిమాలో నటించాడు రజినీకాంత్.
వేట్టయన్ సినిమా ప్రారంభమే ఆశ్చర్యకరం. భారతదేశపు విజ్ఞాన పద్ధతులను చావుదెబ్బ కొట్టి, దేశప్రజలను మేధోపరంగా నిర్వీర్యం చేసేసిన విద్యావిధానాన్ని రుద్దిన బ్రిటిష్ రాజకీయ నాయకుడు థామస్ బాబింగ్టన్ మకాలేకు నివాళులర్పిస్తూ సినిమా మొదలవుతుంది. మకాలేను ‘‘విద్యావ్యవస్థలో సామాజిక న్యాయం, సమానత్వం తీసుకొచ్చిన గొప్పవాడు’’ అంటూ ప్రశంసించేది ఎవరో తెలుసా, అమితాబ్ బచ్చన్. అక్కడినుంచి మొదలు, వేట్టయన్ సినిమాలో ద్రవిడవాద భావజాలం పేరిట అబద్ధాల ప్రచార పరంపర కొనసాగుతుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో మాదకద్రవ్యాల వినియోగం, విద్యార్ధులు శాంతిభద్రతలకు విఘాతం కల్పించడం వంటి దృశ్యాలతో సినిమా మొదలవుతుంది. అప్పుడే దేవదూత లాంటి ఉపాధ్యాయుడు రంగప్రవేశం చేస్తాడు, పోలీసులకు ధైర్యంగా ఫిర్యాదు చేస్తాడు. తర్వాత పోలీసులు ఓ దొంగతో చేతులు కలిపి అతన్ని సైబర్ నిపుణుణ్ణి చేసేస్తారు. అలాంటి తర్కరహితమైన, బాధ్యతారహితమైన దృశ్యాలతో బుర్ర పిచ్చెక్కిస్తారు. షాపింగ్‌మాల్స్‌లో క్యూఆర్‌కోడ్‌లను దుర్వినియోగం చేస్తూ చిన్న దొంగ కోట్లు కొట్టేస్తుంటాడు. అలాంటి అవాస్తవికమైన దృశ్యాలతో యుపిఐ/క్యూఆర్ కోడ్ చెల్లింపుల మీద అనుమానాలు, అనవసర భయాలూ కలగజేస్తాడు దర్శకుడు.
మనసిలాయో పాటలో డాన్సర్లు కేరళీయుల పండుగ ఓణం తరహాలు దుస్తులు వేసుకుని ఉంటారు. దానిమీద హిజాబ్‌లు ధరించి ఉంటారు. ఎవరిని ఆకట్టుకోడానికి ఆ ప్రయత్నం? దానికి తరువాయి ఏంటి? బురఖాలు వేసుకునే డాన్సర్లా?
మురికివాడల్లో కుర్రాడు ఏదో నేరం చేసి పట్టుబడడం, బలమైన సాక్ష్యాలున్నా పోలీసులు వాణ్ణి ఎలాగో వదిలిపెట్టేయడం వంటి అసందర్భమైన, అపహాస్యమైన సన్నివేశాలతో కథ వెడుతూ ఉంటుంది. మధ్యలో రజినీకాంత్ ద్రవిడవాద భావజాలాన్ని ప్రచారం చేసే డైలాగులు చెబుతూ ఉంటాడు.
ఇంక నీట్ పరీక్ష గురించి ఈ సినిమా తీవ్రంగా విమర్శిస్తుంది. అయితే ఆ విమర్శల్లో ఏ పసా లేకపోవడమే అసలైన దరిద్రం. నీట్ ప్రవేశపరీక్ష వల్ల కేవలం ధనవంతులకు మాత్రమే ప్రయోజనం అన్నట్టుగా చూపిస్తారు. దాన్ని సమర్ధించే వాస్తవికమైన డేటా ఏమైనా ఉందా అంటే లేదు. నీట్ పరీక్షకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం అన్నదే ఆ సినిమా ఆశిస్తున్న ప్రయోజనం. విచిత్రమేంటంటే అల్పాదాయ వర్గాలకు చెందిన ఎంతోమంది విద్యార్ధులు నీట్ పరీక్షలో పాస్ అవుతున్న వాస్తవిక సామాజిక ముఖచిత్రాన్ని ఏమాత్రం పట్టించుకోడు దర్శకుడు. ప్రవేశ పరీక్షల మీద, మరీముఖ్యంగా నీట్ మీద సినిమాలో చేసిన దుష్ప్రచారానికి ఎలాంటి ఆధారమూ లేదు. పైగా ఆ పరీక్షలు కేవలం ఆంగ్లంలో మాత్రమే నిర్వహిస్తారంటూ అబద్ధాలు కూడా చెప్పారు సినిమాలో. నిజానికి నీట్ ప్రవేశపరీక్ష ఇంగ్లీషుతో పాటు తమిళం సహా అన్ని ప్రధాన భారతీయ భాషల్లోనూ రాయవచ్చు.
వేట్టయన్ సినిమా సాధారణ రజినీకాంత్ అభిమానులను మోసం చేసింది. ఒకప్పుడు ధర్మానికీ బలానికీ ప్రతీకగా నిలబడే రజినీకాంత్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? డబ్బుల కోసమా లేక ఎలాంటి సైద్ధాంతిక నిలకడలేనితనమా? రెడ్ జెయింట్ సంస్థ నిర్మించిన ఈ సినిమా రజినీ అభిమానులను మోసం చేయడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నంలా ఉంది.
ఇంక హిందువులను దుర్మార్గులుగానూ, మైనారిటీ మతాల వారిని నిజాయితీపరులు, నైతికవిలువలకు కట్టుబడి ఉండేవారు, ధార్మికులుగా చూపించే విధానం ఈ సినిమాలో కూడా కొనసాగింది. హిందువులనే హంతకులు, అవినీతిపరులైన పోలీసు అధికారులు, దురాశాపరులైన కార్పొరేట్ యజమానులుగా చూపించే మూసధోరణిని మరింత బలంగా చూపించారు.
ద్రావిడవాద భావజాలం లేని వారు తమిళ చిత్రపరిశ్రమ నుంచి నేర్చుకోవలసిన విషయం ఒకదాన్ని ఈ సినిమా స్పష్టం చేస్తుంది. ద్రవిడవాద దర్శకులు తమ భావజాలాలను ప్రచారం చేసుకోడానికి సినిమాను ఎంత సమర్థంగా వాడుకుంటారో తెలుసుకోవాలంటే కోలీవుడ్ సినిమాలు చూడాల్సిందే.
ఇలా భారత వ్యతిరేకమైన ద్రవిడవాద భావజాలాన్ని ప్రదర్శించే చిత్రాల్లో రజినీకాంత్ నటించడం ఇదే మొదటిసారి కాదు.
2018లో రజినీకాంత్ నటించిన కాలా చిత్రం వచ్చింది. ఆ చిత్ర దర్శకుడు పా రంజిత్ హిందూ వ్యతిరేక ధోరణి అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో రజినీకాంత్ నల్లటి శాలువా కప్పుకుని ఉంటాడు. విలన్ గ్యాంగ్ కాషాయరంగు శాలువాలు కప్పుకుని నుదుటన బొట్టు పెట్టుకుని ఉంటారు. ఆ సినిమాలో హిందూ పండుగలను ప్రతికూల ధోరణిలో చూపిస్తారు. వినాయకుడు, రాముడు వంటి హిందూ దేవుళ్ళను కించపరిచే సంభాషణలు ఉంటాయి. ప్రధాన ప్రతినాయకుడి పేరు హరి. తన వెధవ పనులను సమర్ధించుకోడానికి రాముణ్ణీ, కృష్ణుణ్ణీ ప్రస్తావిస్తూ ఉంటాడు. ఒక దశలో హీరో అయిన కాలా కూడా ‘నా భూమిని దొంగిలించడమే నీ ధర్మం అయితే నీ దేవుణ్ణి కూడా నేను వదిలిపెట్టను’ అని విలన్‌తో అంటాడు. ఇంక ఆ సినిమాలో బీజేపీ నాయకుడు హెచ్ రాజాపై పరోక్ష విమర్శలు ఉంటాయి. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నెగెటివ్ స్టీరియోటైప్‌లను ప్రజల మనసుల్లో రుద్దే ప్రయత్నాలే అవి. ఆ రాజకీయ కోణాన్ని పక్కన పెట్టినా హిందూమతాన్ని కించపరచడం ప్రధాన ఉద్దేశం.
తర్వాత రజినీకాంత్ పేట సినిమాలో నటించాడు. దాని నిర్మాతలు సన్ పిక్చర్స్, అంటే ఉదయనిధి స్టాలిన్ బంధువులే. దర్శకుడు ఎల్‌టిటిఇని సమర్ధించే కార్తీక్ సుబ్బరాజ్. ఆ సినిమాలోనూ హిందుత్వంపై సూక్ష్మస్థాయిలో దాడులు ఉంటాయి. బొట్టుపెట్టుకున్న పాత్రలు మతోన్మాదులుగా ఉంటాయి, ముస్లిం యువకుడు హిందూ అమ్మాయిని పెళ్ళి చేసుకోడానికి రజినీకాంత్ సహకరిస్తాడు.
రజినీ కుమార్తె తీసిన అట్టర్‌ఫ్లాప్ చిత్రం లాల్ సలామ్‌లోనూ యాంటీ-హిందూ భావజాలం తొంగిచూస్తూనే ఉంటుంది. రజినీకాంత్ ఓ మంచి ముస్లిం అయిన మొయిద్దీన్ భాయ్ పాత్ర పోషించాడు. సహజంగానే విలన్ ఎర్రటి బొట్టు పెట్టుకునే హిందువు. ఒక సీన్‌లో మొయిద్దీన్ భాయ్ కాషాయదుస్తులు ధరించిన సెందిల్‌ను విమర్శిస్తుంటాడు. ‘‘మీరేం చేసారు? రాజకీయాలనూ మతాన్నీ కలిపేసారు. ఆడుకునే పిల్లల మనసుల్లోకి విషాన్ని ఎక్కించారు’’ అంటాడు. ఆ డైలాగులు ఎవరిని ఉద్దేశించి రాసినవో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.
ఇలా రజినీకాంత్ వరుసగా ద్రవిడవాదం పేరిట హిందూవ్యతిరేక భావజాలాన్ని ప్రచారం చేసే చిత్రాల్లో వరసగా నటిస్తుండడం యాదృచ్ఛికం అనుకోవాలా? రజినీ ఇటీవలి సినిమాలన్నీ తన అభిమానులను మోసం చేసాయి. హిందూమతాన్ని రాక్షసంగా చూపించడం, ద్రవిడవాదాన్ని ఘనమైదనిగా చూపించడం అనే పక్షపాత ధోరణితో కూడిన వైఖరి రజినీకాంత్ సినిమాల్లో ప్రధానమైపోయింది. అలాంటి చిత్రాలు ప్రమాదకరమైన మూస ఆలోచనలను సమాజంలోకి ఇంజెక్ట్ చేస్తున్నాయి, విభజన బీజాలు నాటుతున్నాయి. అలాంటి చిత్రాలను ఎంపిక చేసుకోడానికి పూర్తి బాధ్యత రజినీదే. హిందువులపై వివక్ష చూపుతూ, వారిపై ద్వేషాన్ని ప్రచారం చేసే సినిమాలతో ప్రజలను ఎక్కువకాలం ఆకట్టుకోవడం సాధ్యం కాదన్న సంగతిని రజినీకాంత్ గుర్తించాలి.