దేశంలో ఏటా కోట్లాది మంది యువత చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని, కొందరు ఉద్యోగాల్లో చేరినా తమ చదువుకు తగిన ఉద్యోగం లభించలేదని భావిస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు.కొలంబియా యూనివర్సిటీ ఢిల్లీలో నిర్వహించిన సదస్సులో ఆమె ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కోట్లాది మందికి ఉపాధి కల్పించడమే ఇప్పుడు దేశం ముందు ఉన్న పెద్ద సవాల్ అన్నారు. అనేక సవాళ్లను ఎదుర్కొని నిలబడ్డామని, ఉపాధి కల్పించడంలో కూడా విజయం సాధిస్తామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత ఆర్థిక వ్యవస్థ ప్లాస్టిక్ కార్డుల నుంచి క్యూఆర్ కోడ్‌కు వేగంగా మారిందని ఆర్థిక మంత్రి గుర్తు చేశారు. కూరగాయలు కొనుగోలు చేసే దగ్గర నుంచి ప్రతి పనికి డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయన్నారు. థర్మల్ పవర్ నుంచి సౌరశక్తిలోకి దేశం వేగంగా మారుతోందని ఆమె గుర్తుచేశారు.