ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యాకు ఈ ఉదయం బయల్దేరారు. రష్యాలోని కజాన్‌లో 16వ బ్రిక్స్ సమావేశం జరగనుంది.
రష్యాకు బయల్దేరడానికి ముందు ప్రధాని మోదీ ఎక్స్ సామాజిక మాధ్యమంలో బ్రిక్స్ సదస్సు గురించి రాసుకొచ్చారు. ‘‘బ్రిక్స్ సదస్సులో పాల్గొనడానికి రష్యాలోని కజాన్ వెడుతున్నాను. బ్రిక్స్ కూటమికి భారత్ అమిత ప్రాధాన్యత ఇస్తోంది. వివిధ అంశాలపై విస్తృతంగా చర్చలు జరుపుతాము. వివిధ దేశాల అధినేతలతో భేటీ అవడం కోసం ఎదురుచూస్తున్నాను’’ అని మోదీ ట్వీట్ చేసారు.
బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాల కూటమే బ్రిక్స్. ఆ కూటమిలో ఈ యేడాదే మరో ఐదు దేశాలకు – ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ – స్థానం కల్పించారు. ఆ కూటమి 16వ సమావేశాలు ఈ యేడాది అక్టోబర్ 22 నుంచి 24 వరకూ రష్యాలోని కజాన్‌లో జరుగుతాయి. ఈ సమావేశాల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోదీ భాగస్వామ్య దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.
మోదీ ఈ యేడాది రష్యాలో పర్యటించడం ఇది రెండవసారి. 22వ భారత్-రష్యా వార్షిక సమావేశంలో పాల్గొనడానికి మోదీ జులై నెలలో మాస్కో వెళ్ళారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆ సందర్భంగా ఆయనకు రష్యాలోని అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్’ ప్రదానం చేసారు.