తిరుపతి లడ్డూ తయారీలో వాడే ఆవునెయ్యిలో జంతుకొవ్వులు కలిసాయన్న ఆరోపణల వివాదం నేపథ్యంలో ఒడిషా పూరీలోని ప్రపంచ ప్రఖ్యాత శ్రీ జగన్నాథ్ మందిర్ అడ్మినిస్ట్రేషన్ (ఎస్జెటిఎ) తాజాగా నిర్ణయం తీసుకుంది. ఒడిషా రాష్ట్ర సహకార పాల ఉత్పత్తిదారుల ఫెడరేషన్ (ఒఎంఫెడ్) ఉత్పత్తి చేసే నేతిని మాత్రమే మహాప్రసాదం తయారీకి, దీపాలు వెలిగించడానికీ ఉపయోగించాలని నిర్ణయించుకుంది.
జగన్నాథ ఆలయంలో ఒఎంఫెడ్ వారి నెయ్యి తప్ప మరే ఇతర నేతినీ అనుమతించబోరు. జగన్నాథ మందిరం అవసరాలకు సరిపడేటంత నేయి సరఫరా చేయడానికి ఒఎంఫెడ్ ప్రత్యేకంగా ఒక డిపో ఏర్పాటు చేయాలని ఆలయ నిర్వాహకులు కోరారు. ఆ మేరకు శ్రీ జగన్నాథ్ మందిర్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన నిర్వాహకులు డాక్టర్ అరవింద్ పధి ఒఎంఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌కు ప్రత్యేకంగా లేఖ రాసారు.
‘‘ఆలయంలోపల మహాప్రసాదం తయారీకి, దీపాలు వెలిగించడానికీ ఒఎంఫెడ్ నేతిని మాత్రమే వినియోగించాలని నిర్ణయం తీసుకున్నాం. ఆలయంలోని వివిధ వర్గాల వారితో ఈ నిర్ణయం గురించి చర్చించాం. వారందరూ దీనికి అంగీకరించారు. కాబట్టి ఆలయం అవసరాలకు సరిపడా నేతిని సరఫరా చేయడానికి చర్యలు తీసుకోగలరు. దీనికోసం ప్రత్యేకంగా ఒక డిపో ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాము. దానివల్ల నేతిలో కల్తీ జరగకుండా ఆపవచ్చు’’ అని డాక్టర్ అరవింద్ తన లేఖలో పేర్కొన్నారు.
పూరీ జగన్నాథుడి కైంకర్యానికి వాడే నేతి ధరను వీలైనంత తగ్గించవలసిందిగా డాక్టర్ అరవింద్ పధి ఒఎంఫెడ్ను కోరారు. ఈ నియమాలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆలయంలోకి సహకార సంస్థ నెయ్యి మాత్రమే రావాలని, మరే ఇతర నెయ్యీ రాకుండా జాగ్రత్తలు వహించాలనీ ఆయన ఆలయ యాజమాన్యానికి సూచించారు.
కొన్నేళ్ళ క్రితం పూరీ జగన్నాథస్వామి ఆలయంలో దీపాలు వెలిగించేందుకు వాడే నేతి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆలయ ప్రాంగణంలో దీపాలు విక్రయించేవారు కల్తీ నెయ్యి వాడుతున్నారని తెలిసింది. అప్పుడే జగన్నాథ ఆలయంలో ఒఎంఫెడ్ సరఫరా చేసే నెయ్యి తప్ప ఆలయ ప్రాంగణంలో మరే ఇతర నెయ్యీ వాడకూడదని మార్గదర్శకాలు జారీచేసారు. ఆ సమయంలోనే పూరీ ఆలయంలో ఒఎంఫెడ్ వారి ప్రత్యేక దుకాణం ఏర్పాటు చేసారు. కొన్నాళ్ళు నిక్కచ్చిగా వ్యవహరించినా క్రమంగా ప్రమాణాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తగ్గింది. దాంతో దుకాణదారులు మళ్ళీ తక్కువ నాణ్యత కలిగిన నేతి దీపాలు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఈమధ్య మళ్ళీ పెరిగాయి.