బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, తీవ్ర అల్పపీడనంగా ( imd weather report) మారింది. రాబోయే 48 గంటల్లో అది వాయుగుండంగా మారే ప్రమాదముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో గడచిన 24 గంటల్లోనే 15 సెం.మీ వర్షపాతం ( heavy rains) నమోదైంది. వెంకటగిరి, కావలి, నెల్లూరు ప్రాంతాల్లో 146 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బడులకు సెలవులు ప్రకటించారు.
అల్పపీడనం వాయుగుండంగా మారి తమిళనాడు, దక్షిణకోస్తా మధ్య తీరందాటే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మరో 48 గంటల్లో వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. దీని ప్రభావంతో రాబోయే 3 రోజులు దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది.