భారత ఆర్ధిక వ్యవస్థలో మొట్టమొదటిసారి మన దేశపు విదేశీమారకద్రవ్య నిల్వలు 700 బిలియన్ డాలర్ల స్థాయిని అధిగమించాయి. ఫారెక్స్ రిజర్వ్‌లు వరుసగా గత ఏడు వారాలుగా గణనీయమైన పెరుగుదలను నమోదు చేస్తూ వచ్చాయి.
విదేశీమారకద్రవ్య నిల్వలు 700 బిలియన్ డాలర్ల కంటె ఎక్కువ ఉన్న దేశాలు ఇప్పటివరకూ మూడే ఉన్నాయి. అవి చైనా, జపాన్, స్విట్జర్లాండ్. ఇప్పుడు భారతదేశం వాటి సరసన చేరింది.
సెప్టెంబర్ 27తో ముగిసిన వారానికి భారతదేశపు విదేశీమారకద్రవ్య నిల్వలు 12.588 బిలియన్ డాలర్లు పెరిగి, మొత్తంగా 704.885 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది భారత ఆర్ధిక చరిత్రలో కొత్త అత్యధిక పెరుగుదల. 2023 జులై నుంచి ఇప్పటివరకూ ఒక వారంలో ఫారెక్స్ రిజర్వ్‌లు ఇంత పెరగడం ఇదే మొదటిసారి. అదేవారంలో రూపాయి విలువ బలపడింది. డాలర్ విలువ కొంత దిగొచ్చి 83.50కి చేరుకుంది. అంతకుముందువారంలో ఫారెక్స్ నిల్వలు 2.838 బిలియన్ డాలర్లు పెరిగి 692.296 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
మొత్తం మీద ఈ యేడాది భారతదేశపు విదేశీమారకద్రవ్య నిల్వలు 87.6 బిలియన్ డాలర్లు పెరిగాయి. గతేడాది పన్నెండు నెలల వ్యవధిలోనూ ఆ పెరుగుదల 62 బిలియన్ డాలర్లు మాత్రమే.
విదేశీ మారకద్రవ్య నిల్వలు ఇంత గణనీయమైన స్థాయిలో ఉండడం దేశీయ ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ విపణుల్లోని ఒడుదొడుకులను తట్టుకోవడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
మన విదేశీమారకద్రవ్య నిల్వల్లో ఫారిన్ కరెన్సీ ఎసెట్స్ (ఎఫ్‌సిఎలు), బంగారం నిల్వలు, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డిఆర్‌లు) ఉంటాయి. ఇంకా అంతర్జాతీయ ద్రవ్యనిధిలో మన దేశపు నిల్వల పరిస్థితిని కూడా ఈ అంచనాకు పరిగణిస్తారు.
భారత రిజర్వు బ్యాంకు తాజా గణాంకాల ప్రకారం భారతదేశపు ఫారిన్ కరెన్సీ ఎసెట్స్ 10.468 బిలియన్ డాలర్లు పెరిగి 616.154 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఫారెక్స్ నిల్వల్లో ఈ ఎఫ్‌సిఎలదే మెట్టువాటా. ఇంక బంగారం నిల్వలు 2.184 బిలియన్ డాలర్ల నుంచి 65.796 బిలియన్ డాలర్లకు పెరిగాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 8 మిలియన్ డాలర్ల నుంచి 18.547 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అయితే అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)లో భారతదేశపు నిల్వలు 71 మిలియన్ డాలర్లు తగ్గి 4.387 బిలియన్ డాలర్లకు చేరుకుంది.