గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో సెప్టెంబర్ 28 శనివారం నాడు ఒక మసీదు, ఒక దర్గా, ఒక శ్మశానాన్ని తొలగించివేసారు. ముందస్తు అనుమతి లేకుండా అటువంటి పనులు చేయకూడదంటూ ఇటీవల సుప్రీంకోర్టు నిషేధాజ్ఞలు జారీ చేసినా ఆ తొలగింపు పనులు పూర్తి చేసారు. ‘దురాక్రమణల తొలగింపు డ్రైవ్’లో భాగంగా సోమనాథ్ మందిరం దగ్గర నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసారు.
దురాక్రమణల తొలగింపు కోసం గుజరాత్ ప్రభుత్వం 36 జేసీబీలు, 70 ట్రాక్టర్లు, 5 హిటాచీ మెషీన్లు, 10 డంపర్లతో పాటు 1400 మంది పోలీసులను కూడా మోహరించింది. జేసీబీలు, భారీ యంత్రాలతో అక్రమ నిర్మాణాలను ఎలా తొలగిస్తారో చూడడానికి మైనారిటీలు పెద్దసంఖ్యలో గుమిగూడారు. అలా ఈ ఆపరేషన్ ప్రశాంతంగా ముగిసింది. ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు ఆందోళన చేస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.
సోమనాథ్‌లో నిర్మాణాల తొలగింపు ప్రక్రియను కొంతమంది వీడియోలు తీసారు. వాటిని తమతమ ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నారు. ప్రభాస్ పాటన్ వేరావల్ అనే ప్రదేశం దగ్గర మసీదులు, దర్గాలు, శ్మశానాలను తొలగించడానికి బుల్డోజర్లు వాడారన్న ఆరోపణలూ వినవచ్చాయి.
మసీదు, దర్గాల తొలగింపు ప్రక్రియ శనివారం తెల్లవారుజామున సుమారు 4గంటలకు మొదలైంది. గుజరాత్లో, ప్రత్యేకించి సోమనాథ్ లాంటి సముద్రతీర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించి తమ మతాలకు చెందిన నిర్మాణాలు చేపట్టడం కొన్ని మతాలవారికి అలవాటైన పనే.
ఈ ప్రాంతానికి చారిత్రక ఘర్షణల నేపథ్యం ఉంది. మహమ్మద్ గజినీ తన దండయాత్రల సందర్భంలో ఈ ప్రాంతాన్ని లక్ష్యం చేసుకుని పదేపదే దాడులు చేసాడు. మూలవిరాట్టు మూర్తిని నాలుగు ముక్కలు చేసి హిందువులను అవమానించాడు. వాటిలో ఒక ముక్కను గజినీ నగరానికి తీసుకెళ్ళాడు. అక్కడ జామా మసీదు ప్రవేశ ద్వారం దగ్గర అమర్చాడు. ఇంకొక ముక్కను తన రాజభవనం అంతఃపుర ద్వారం దగ్గర పాతించాడు. మరో రెండింటిని మక్కా, మదీనా పంపించాడు. అక్కడి మసీదులలో పూడ్పించాడు. అలా సోమనాథ మందిర ఆలయాన్ని దోచిన తీరు ఇతర ఇస్లామిక్ బందిపోట్లను కూడా ఆకర్షించింది. వారు సోమనాథ్ మాత్రమే కాక ద్వారక, గిర్నార్ వంటి వివిధ ఆలయాలను లక్ష్యం చేసుకున్నారు.
కాలక్రమంలో భారతీయ ధార్మిక క్షేత్రాలలోని ఆలయాలు, మందిరాల వద్ద ఎన్నో అక్రమ కట్టడాలు వెలిసాయి. వాటిలో చాలావరకూ గుజరాత్ ప్రభుత్వం తొలగించివేసింది. బెట్ ద్వారక, పోర్బందర్, జామ్‌నగర్ వంటి తీర ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టి అలాంటి అక్రమ కట్టడాలను తీసివేసింది. అలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు కేవలం దురాక్రమణలను మాత్రమే తొలగించడం లేదు. భూముల ఆక్రమణలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, స్మగ్లింగ్ వంటి జాతీయ భద్రతకు ప్రమాదకరమైన కార్యక్రమాలను సైతం నిలువరిస్తున్నాయి.