ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో శతాబ్దాల నాటి పురాతన దేవాలయాలు వందల సంఖ్యలో ధ్వంసం చేయబడ్డాయి. అదే క్రమంలో తాజాగా సేనాపతి జిల్లాలో కుకీ ఉగ్రవాదులు ఒక హిందూ దేవాలయాన్ని తగులబెట్టారు. బుధవారం (సెప్టెంబర్ 25) అర్ధరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో సేనాపతి పట్టణంలోని ప్రఖ్యాత పశుపతినాథ ఆలయాన్ని దగ్ధం చేసారు. ఇటీవలి కాలంలో ఆ గుడిపై ఇది రెండో దాడి అనీ, ఈసారి గుడి ఎక్కువగా ధ్వంసమైందనీ స్థానిక భక్తులు ఆవేదన చెందుతున్నారు.
ముసుగు ధరించిన ఒక ఆగంతకుడు మొదట ఒక స్తంభం వెనుక నక్కడం, తర్వాత మందిర సముదాయం లోపలికి మండుతున్న కాగడా విసరడం, తర్వాత అక్కడినుంచి పారిపోవడం అంతా సిసిటివి ఫుటేజ్‌లో నమోదయింది. కరోంగ్ సేనాపతి టౌన్ కమిటీ, నాగా పీపుల్స్ ఆర్గనైజేషన్ సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో ఆ దుర్ఘటనను తీవ్రంగా ఖండించాయి. సాధారణంగా సేనాపతి పట్టణ ప్రజలు ప్రశాంతతను, మతస్వేచ్ఛనూ కోరుకుంటారని, అలాంటి సమాజ సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామనీ ఆ సంస్థలు చెప్పాయి. నేరస్తులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసాయి.
మెయితీ దేవాలయాల పరిరక్షణ కమిటీ ప్రతినిధులు పశుపతినాథ్ మందిరంపై దాడి కుకీ ఉగ్రవాదుల కుట్రేనని విస్పష్టంగా చెబుతున్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేసే కుకీ ఉగ్రవాదులు ఇప్పటివరకూ మెయితీలకు చెందిన 393 దేవాలయాలు, ప్రార్థనాస్థలాలను ధ్వంసం చేసారు, దోచుకున్నారని ఆ కమిటీ వెల్లడించింది.