తిరుమల లడ్డూ వివాదంలో నిజానిజాలు వెలికితీయాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్‌సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాసారు. చంద్రబాబునాయుడు అబద్ధాలకోరు అని, రాజకీయ దురుద్దేశంతోనే తిరుపతి లడ్డూలపై ఆరోపణలు చేసారనీ జగన్ ఆరోపించారు. పరీక్షల్లో కచ్చితత్వంపై నిర్ధారణ లేకుండా చంద్రబాబు చేసిన ఆరోపణలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. చంద్రబాబు సృష్టించిన అనుమానాలను నివృత్తి చేయాలని, టిటిడి పవిత్రతపై భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఆ చర్య సహాయ పడుతుందనీ జగన్ సూచించారు.
జగన్ తన లేఖలో ఇలా రాసారు….
‘‘తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతను, ప్రతిష్టను కోలుకోలేని విధంగా దెబ్బతీసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారు. వేంకటేశ్వరస్వామికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందూ భక్తులు ఉన్నారు. ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా చూడకపోతే పరిస్థితులు దిగజారే ప్రమాదం ఉంది. లేకపోతే చంద్రబాబు చెప్తున్న అబద్ధాలు అందరికీ వ్యాపించి, తీవ్ర వేదనను కలిగిస్తాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తైన సందర్భంగా, గొప్పలు చెప్పుకునేందుకు టీడీపీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. కాని కొత్త ప్రభుత్వం పట్ల ప్రజాభిప్రాయం ప్రతికూలంగా ఉంది. ప్రజల దృష్టిని మరల్చడానికే, టీటీడీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారు. దానిలో భాగంగా తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వు చేరిందని తప్పుడు ఆరోపణలు చేసారు. తర్వాత కూడా ఆయన అత్యంత బాధ్యతా రాహిత్యంగా, అవాస్తవాలు చెప్పారు. కేవలం రాజకీయ దురుద్దేశాలతోనే చంద్రబాబు ఆ ప్రచారం చేశారు. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బ తిన్నాయి.
కల్తీ జరిగిందని ఆరోపణలతో తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు 2024, జూలై 12న తిరుమలకు వచ్చాయి. వాటిలోని నెయ్యిని వాడలేదు. దశాబ్దాలుగా టీటీడీలో ఉన్న అత్యుత్తమ విధానాల వల్ల నెయ్యిలో సందేహాస్పద పదార్థాలు ఉంటే వెంటనే గుర్తిస్తారు. అలా ట్యాంకర్లు వెనక్కి పంపారని, ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదని తెలిసి కూడా చంద్రబాబునాయుడు బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేశారు. అది కోట్లాదిమంది భక్తుల్లో ఆవేదన కలిగించింది.
ఆలయ అవసరాలకు నెయ్యి కొనుగోలు కోసం టీటీడీ ఇ–టెండర్ ప్రక్రియను అనుసరిస్తోంది. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి టెండర్లు పిలుస్తుంది. నియమ నిబంధనలు, ప్రమాణాలకు అనుగుణంగా సరఫరా సంస్థను ఎంపిక చేస్తుంది. ఆమోదం కోసం టీటీడీ బోర్డు ముందు ఉంచుతారు. నెయ్యి వినియోగానికి ముందు నాణ్యతను పరిశీలించడానికి తనిఖీ వ్యవస్థలు ఉన్నాయి.
నెయ్యిని ఆలయానికి పంపే ముందు దాని స్వచ్ఛత, నాణ్యతలపై గుర్తింపు పొందిన ఏజెన్సీల ధ్రువీకరణ తప్పనిసరి. ఆలయంలోకి వెళ్ళే ముందు ప్రతీ ట్యాంకర్ నుండి మూడు నమూనాలు తీసి పరీక్షిస్తారు. ఆ మూడు నమూనాల్లో ఉత్తీర్ణత సాధించాకే నెయ్యిని అనుమతిస్తారు. ఏ పరీక్షలోనైనా సందేహాస్పద పదార్థాలు కనిపిస్తే ఆ ట్యాంకర్‌ను తిరస్కరిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించరు. ఇలాంటి అత్యుత్తమ విధానాలు పాటిస్తున్నందు వల్ల ప్రసాదాల తయారీలో నాణ్యత లేని పదార్థాలను ఉపయోగిస్తున్నారనే ప్రశ్నే తలెత్తదు.
2014–19 మధ్య టీడీపీ హయాంలో 14 నుంచి 15 సార్లు ట్యాంకర్లను ఇలాగే తిరస్కరించారు. 2019–24 మధ్య వైసీపీ హయాంలో 18 సార్లు ట్యాంకర్లను తిరస్కరించారు. అటువంటి ధృఢమైన విధానాలు, పద్ధతులు అమల్లో ఉన్నందున, కల్తీ నెయ్యితో ప్రసాదాల తయారీకి ఆస్కారమే లేదు. ఈ విధానం గత కొన్ని దశాబ్దాలుగా టీటీడీలో అమలులో ఉంది.
బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు, టీటీడీలో పాటిస్తున్న అత్యుత్తమ విధానాల గురించి, టీటీడీ ప్రతిష్ఠ గురించి ప్రజలకు చెప్పాల్సింది పోయి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. సామాజిక బాధ్యత లేకుండా చంద్రబాబు వ్యవహరించారు.
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో, ఆతర్వాత వైయస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో ట్యాంకర్లను తిరస్కరించిన పద్ధతుల్లో భాగంగానే జులై నెలలో కూడా నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించారు. తిరస్కరించిన ట్యాంకర్లను ఆధారంగా చేసుకుని 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో టీడీపీ రాజకీయ సమావేశంలో చంద్రబాబు సున్నితమైన ఈ అంశంపై బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాజకీయ ఉద్దేశాలు ఇట్టే అర్థం అవుతున్నాయి. కచ్చితంగా ఇది నేరం.
NDDB CALF నుంచి వచ్చిన నివేదికలో పేర్కొన్న ఎస్– విలువలు నిర్దేశించిన విలువల పరిమితి కన్నా తక్కువ ఉండడంపై ల్యాబ్ కొన్ని సందేహాలను కూడా వ్యక్తం చేసింది. తాము ఇచ్చిన ఫలితాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో కచ్చితత్వం లోపించే అవకాశం ఉందని అందులో ఉంది. పోషకాహార లోపం ఉన్న ఆవులనుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల, వెజిటబుల్ ఆయిల్స్‌ను ఆహారంగా తీసుకునే ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసిన నెయ్యి వల్ల, వేర్వేరు విధానాల్లో తీసే నమూనాల వల్ల కచ్చితత్వం లోపిస్తుందని నివేదికలో ఉంది. పైన పేర్కొన్న పరిస్థితుల్లో ల్యాబ్ పరీక్షల్లో తప్పుడు ఫలితాలు వస్తాయని పేర్కొంది. ఉదాహరణకు, పోషకాహార లోపం ఉన్న ఆవు నుండి వచ్చే పాల నుంచి నెయ్యి పొందినట్లయితే లేదా పామాయిల్ అధికంగా తినిపించిన ఆవు పాల నుంచి నెయ్యి పొందినట్లయితే, జంతువు కొవ్వు ఉనికిని సూచించే పరీక్షల్లో కచ్చితత్వంతో సరైన ఫలితాలు కనుగొనే అవకాశాలు ఉండవు. పరీక్షల్లో కచ్చితత్వంపై నిర్ధారణ లేకుండా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి దిగ్భ్రాంతి కలిగించే ఆరోపణలు చేయకూడదు.
మరొక అంశంలో కూడా టీడీపీ, ఆ పార్టీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్నేళ్లుగా తిరుమలలో కర్ణాటక కో–ఆప్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ (KMF) నెయ్యి సరఫరా చేసేదని, దాన్ని వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం నిలిపేసిందని ప్రచారం చేస్తున్నారు. అది పూర్తిగా సత్యదూరం.
2014–19 మధ్య టీటీడీ నిర్వహించిన టెండర్లలో KMF కొన్ని సార్లు మాత్రమే పాల్గొంది. టీడీపీ అధికారంలో ఉన్న 2015 నుంచి 2018 అక్టోబరు వ్యవధిలో కూడా KMF టీటీడీకి నెయ్యి సరఫరా చేయలేదు. టెండర్ల ప్రక్రియలో పాల్గొని ఎల్–1 ఆధారంగా ఎంపికైన ప్రైవేటు సంస్థలే నెయ్యి సరఫరా చేసాయి. అలాగే వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో కూడా కొన్నిసార్లు KMF నెయ్యి సరఫరా చేసింది. నందిని విషయంలో టీడీపీ ఆరోపణలు పూర్తిగా నిరాధారం. నిజానికి, వైఎస్సార్‌సీపీ హయాంలో టీటీడీ చేపట్టిన కొన్ని చర్యల పట్ల నేను గర్వపడుతున్నాను.
ఆలయంలో వినియోగించే నేయి సహా సరుకుల స్వచ్ఛత, నాణ్యతలపై పరీక్షలు జరపడానికి ప్రయోగశాలలను బలోపేతం చేశాం. ఈ విషయంలో ప్రఖ్యాత CFTRI (సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) సేవలను టీటీడీ తీసుకుంది. నవనీత సేవను ప్రారంభించడమే కాదు, శుద్ధ నెయ్యి సరఫరా కోసం తిరుమలలో గోశాలను స్థాపించాం. టీటీడీ అర్చకుల జీతాలు రెట్టింపు చేసాం. టీటీడీ ఉద్యోగులకు వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ హయాంలో ఇంటి స్థలాలు అందించాం. వైసీపీ హయాంలోనే జమ్మూలో టీటీడీ ఆలయాన్ని నిర్మించాం. 2023లో దీన్ని ప్రారంభించాం.
వైసీపీ హయాంలోనే ముంబై, రాయ్‌పూర్, అహ్మదాబాద్‌లలో బాలాజీ కొత్త ఆలయాల నిర్మాణం ప్రారంభించాం.
2024 జూలై 12న తిరుమలకు చేరుకున్న నెయ్యి ట్యాంకర్‌లోని నమూనాలు సందేహాస్పదంగా ఉన్నాయని, మూడు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయాయని, వాటి నమూనాలను కూడా పంపినట్లు బహిరంగంగా వెల్లడించారు.
తదుపరి ఆ నమూనాలను NDDB CALF ల్యాబొరేటరీకి జూలై 17, 2024న పంపారు. వాటిని పరిశీలించి, పరీక్షలు చేసి విశ్లేషించిన ఫలితాలను 23 జూలై, 2024న నివేదించారు. నెయ్యి కల్తీ జరిగిందన్న సందేహాలు వ్యక్తమైన ట్యాంకర్లు టీటీడీ ఆవరణలోకే అనుమతించలేదన్న విషయాన్ని ఇక్కడ గమనించాలి. 2024 సెప్టెంబరు 18న జరిగిన రాజకీయ పార్టీ సమావేశంలో ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చారు. ట్యాంకర్ తిరస్కరించబడిన రెండు నెలల తర్వాత టీడీపీ కార్యాలయం నుంచి ల్యాబ్ నివేదిక విడుదల చేశారు. టిటిడి పవిత్రతను కించపరిచేలా మొత్తం ఈ అంశాన్ని రాజకీయ లక్ష్యాల సాధన కోసం ఉపయోగించుకునేందుకు వేసిన పథకం ఇది. ల్యాబ్ రిపోర్టు వచ్చాక రెండు నెలలపాటు చంద్రబాబు మౌనంగా ఉన్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలపలేదని, ఒకవేళ అలా చేసి ఉంటే నిరంతరంగా జరిగే నాణ్యత, స్వచ్ఛత నిర్ధారణ తనిఖీల్లో అది తేలుతుందనే విషయం చంద్రబాబుకు తెలుసు కాబట్టే.. రెండు నెలలపాటు మౌనంగా ఉన్నారు. తదుపరి చంద్రబాబు చేసిన ఆరోపణలు బాధ్యతారాహిత్యం, పచ్చి అబద్ధం. కేవలం రాజకీయ లక్ష్యాల కోసం చంద్రబాబు ఈ ఆరోపణలు చేశారు.
చంద్రబాబు ఒక అబద్ధాల కోరు. అబద్ధాలు చెప్పడం అతనికి అలవాటు. కేవలం రాజకీయాల కోసం కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను తీవ్రంగా దెబ్బ తీసేలా దిగజారారు. ఆయన చర్యలు నిజానికి ముఖ్యమంత్రి స్థాయిని మాత్రమే కాకుండా ప్రజాజీవితంలో ఉన్న ప్రతి ఒక్కరి స్థాయిని దిగజార్చాయి. ప్రపంచ ప్రఖ్యాత టీటీడీని, టీటీడీ అనుసరిస్తున్న పద్ధతుల ఔన్నత్యాన్ని దెబ్బ తీసాయి.
ఇలాంటి కీలక సమయంలో దేశం మొత్తం మీవైపు చూస్తోంది. అబద్ధాలను వ్యాప్తి చేసిన చంద్రబాబునాయుడును తీవ్రంగా మందలించాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు నిజానిజాలను వెలుగులోకి తీసుకు రావడం అత్యవసరం. కోట్లాది మంది హిందూ భక్తుల మదిలో చంద్రబాబునాయుడు సృష్టించిన అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు, టిటిడి పవిత్రతపై భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఇది సహాయపడుతుంది.’’