ఉపముఖ్యమంత్రి, జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించారు. తిరుమల లడ్డూల కల్తీ ఘటనతో ఆవేదన చెంది ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ ఉదయం చేపట్టిన దీక్షను 11 రోజులు కొనసాగించి, అనంతరం తిరుమల ఆలయాన్ని దర్శించుకుంటారు. గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తినిమ్మని స్వామిని వేడుకుంటారు.
ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించిన తరువాత ఉపముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘‘2019లో అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వం తిరుమలలో సంస్కరణల పేరిట చాలా మార్పులు చేసింది. శ్రీవాణి ట్రస్టు పేరిట 10వేలు వసూలు చేసి రూ.500కే బిల్లు ఇచ్చేవారు. మహాప్రసాదంగా భావించే శ్రీవారి లడ్డూను అపవిత్రం చేస్తే మాట్లాడకుండా ఊరుకోవాలా? అంత ఘోరం జరుగుతుంటే వైవీ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి ఏం చేసారు? తప్పులు చేసినవారిని జగన్ ఎలా సమర్థిస్తారు? కోట్లమంది హిందువులు పరమపవిత్రంగా భావించే ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దోషులకు శిక్ష పడాల్సిందే. ఆవేదన కలిగినప్పుడు పోరాటం చేస్తాం. దోషులకు కఠిన శిక్ష పడాల్సిందే. ఈ మొత్తం వ్యవహారం మీద మంత్రివర్గ సమావేశంలోనూ, శాసనసభలోనూ చర్చ జరగాలి’’ అంటూ పవన్కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
తిరుమల లడ్డూప్రసాదంలో జంతుకొవ్వుల వ్యవహారం వెలుగుచూసినప్పుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ‘‘జాతీయ స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక సంస్థను ఏర్పాటు చేయాలి. దేశంలోని అన్ని దేవాలయాల వ్యవహారాలనూ దాని పరిధిలోకి తీసుకురావాలి’’ అని సూచిస్తూ ‘ఎక్స్’లో ట్వీట్ చేసారు. ఆ సూచనకు దేశవ్యాప్తంగా విశేష స్పందన వచ్చింది.