అసఫ్‌జాహీ వంశపు ఆఖరి నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ‘మజ్లిస్ ఇత్తెహాద్ ఉల్ ముస్లిమీన్ – ఎంఐఎం’ అనే ఉన్మాద సంస్థ నియంత్రణలో ఉండేవాడు. సంస్థానం వ్యవహారాల్లో నిజాం మాటకు కాక ఎంఐఎం మాటకే విలువ ఉండేది. ప్రభుత్వ నిర్వహణలో పెద్దసంఖ్యలో బయటి వ్యక్తుల జోక్యం, ప్రభావం ఉండేది. దాంతో స్థానిక ముస్లిములకు తమ భవిష్యత్తు, అధికారాలు, విలాసాలు, ఉద్యోగావకాశాల గురించి ఆందోళనగా ఉండేది. ఫలితంగా ముల్కీ-నాన్‌ముల్కీ వివాదం బాగా ముదిరింది. నాన్‌ముల్కీ గ్రూపు తమ భద్రత కోసం ఇత్తేహాద్-ఉల్-ముస్లిమీన్ (ముస్లిములు అంతా ఒకటే) అనే పేరుతో ఉద్యమం ప్రారంభించింది. ఆజాద్ హైదరాబాద్ కలను సాకారం చేసుకోవాలని భావిస్తున్న స్థానిక ముస్లిముల మద్దతు కూడగట్టుకోవడం దాని లక్ష్యం.
ఆ ఉన్మాద సంస్థ 1926లో ఏర్పడింది. దాని వ్యవస్థాపక అధ్యక్షుడు మొహమ్మద్ నవాజ్ ఖాన్. ఆ గ్రూపులో పఠానులు, రోహిల్లాలు చేరారు. దాంతో ఆ గ్రూపును రజాకార్లు (దేవుడి సేవకులు) అని పిలిచేవారు. ఆ సంస్థ బహదూర్ యార్ జంగ్, కాసిం రజ్వీల నాయకత్వంలో సంస్థానం వ్యవహారాల్లో కీలక స్థానానికి చేరుకుంది. నిజాం అండదండలు ఉండబట్టే ఆ సంస్థ ఎదుగుదల సాధ్యమైందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
‘ఇత్తేహాద్’కు బహదూర్ యార్జంగ్ 1927లో నాయకుడయ్యాడు. అతని నేతృత్వంలో సంస్థ చాలా బలపడింది. 1927, 1928 కాలంలో బహదూర్ యార్జంగ్ హైదరాబాద్ సంస్థానాన్ని ముస్లిం రాజ్యంగా ప్రకటించాలని డిమాండ్ చేసాడు. ఆ డిమాండ్ ఆర్యసమాజ్, హిందూమహాసభ, తదితర జాతీయవాదులకే కాదు, ఉదారవాద ముస్లిములకు కూడా పెద్ద షాక్. అప్పటి ఉదారవాద ముస్లిములు రాజ్యంలో రాజకీయ, సాధారణ, మతపరమైన స్వేచ్ఛ పునరుద్ధరణ కోసం బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఉండాలని నిజాయితీగా కోరుకున్నారు.
బహదూర్ యార్జంగ్ 1944లో చనిపోయాడు. అతని స్థానంలో ఇత్తేహాద్ వ్యవహారాలు చూసుకోడానికి నిజాం అబ్దుల్ హసన్‌ను నియమించాడు. అతనో ఉదారవాద హిందువు. ఆర్యసమాజ్ కార్యకలాపాలు, రాష్ట్ర కాంగ్రెస్ కార్యక్రమాల పట్ల సుహృద్భావం కలిగిన వ్యక్తి. అతను నిజాం పాడమన్నట్టు పాడి, ఆడమన్నట్టు ఆడేవాడు కాదు. దాంతో నిజాం 1946లో కాసిం రజ్వీని ఇత్తేహాద్ అధ్యక్షుడిగా నియమించాడు. అప్పటినుంచీ ఇత్తేహాద్ కార్యకలాపాలు చాలా తీవ్రంగా జరిగాయి. 1947-48 మధ్యలో తారస్థాయికి చేరుకున్నాయి. కాసిం రజ్వీ పాలనలోని ఆ కాలాన్ని భయంకరమైన పాలనా కాలంగా వ్యవహరించేవారు.
కాసిం రజ్వీ మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి చెందినవాడు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి స్వస్థలం లాతూర్‌లో లీగల్ ప్రాక్టీస్ ప్రారంభించాడు.
కాసిం రజ్వీ 1947లో హైదరాబాద్‌లో రజాకార్ వ్యవస్థను ఏర్పాటు చేసాడు. అతని నాయకత్వంలో ముస్లిములు ‘ఇత్తేహాద్’ కోసం తమ ప్రాణాలనైనా సరే త్యాగం చేస్తామని ప్రతిజ్ఞలు చేసారు. ‘‘అల్లా పేరు మీద దక్కన్లో అధికారం కోసం పోరాడతానని వాగ్దానం చేస్తున్నాను’’ అంటూ ఆ రజాకార్లు సంస్థలో చేరే సమయంలో వాగ్దానం చేసేవారు.
హైదరాబాద్ పాలకులు ముస్లిములు మాత్రమేననీ, హిందువులకు సంస్థాన పరిపాలనలో చోటే లేదనీ కాసిం రజ్వీ బహిరంగంగానే ప్రకటించాడు. నవాబు మంత్రివర్గం రజ్వీ నిర్దేశాల మేరకే ఏర్పాటయింది. ముస్లిములలో కూడా సున్నీలకే ఆధిక్యం ప్రకటించారు. షియా అధికారులను సర్వీసు నుంచి తప్పించి వారి స్థానంలో సున్నీలకు అధికారం కట్టబెట్టారు. సంస్థానం పరిధిలో ఏ వ్యవస్థనైనా నియంత్రించే అన్ని అధికారాలూ కాసిం రజ్వీ చేతిలో ఉండేవి. రజ్వీ అనుచరుడైన సయ్యద్ తాకియుద్దీన్ను గూఢచార విభాగానికి అధిపతిని చేసారు. పోలీసు విభాగానికి కొత్త మంత్రి అయిన మొయిన్ నవాజ్ జంగ్‌ను కాసిం రజ్వీ పూర్తిగా తన నియంత్రణలో పెట్టుకున్నాడు. ఇత్తెహాద్ కోసం ఉద్దేశించిన ఆయుధాలు, మందుగుండు తీసుకువెళ్ళే వాహనాలను తనిఖీ చేయకూడదంటూ పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. ఒక్కమాటలో చెప్పాలంటే నిజాం సంస్థానానికి నిజమైన పాలకుడు కాసిం రజ్వీయే.
తన లక్ష్యాన్ని సాధించడానికి రజ్వీ హైదరాబాద్ సంస్థానంలో రజాకార్ సంస్థల నెట్వర్క్ ఏర్పాటు చేసాడు. హైదరాబాద్‌లో 52 కేంద్రాల్లో రజాకార్ గ్రూపులను ఉంచాడు. ఒక్కో కేంద్రంలో 2వేల మంది శిక్షితులైన రజాకార్లు ఉండేవారు. రజాకార్ వాలంటీర్లుగా పేర్లు నమోదు చేసుకున్న వారికి ఆ కేంద్రాల్లో ఆయుధాల వాడకం గురించి శిక్షణ ఇచ్చేవారు. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో అలాంటి రజాకార్ బలగాలను బీదర్, గుల్బర్గ, అలంద్, యెల్సంగి, రాయచూరు, గంగావతి, సురపురం, కుకునూరు, కుశతగి, హనంసాగర్ రాజూర్, కొప్పాళ, తుంగభద్ర ప్రాంతాల్లో ఏర్పాటు చేసారు. వాటిలో ఒక్కో కేంద్రంలో 400 నుంచి 650 వరకూ రజాకార్లు ఉండేవారు. జిల్లా ప్రధానకేంద్రంలో 2వేల మంది రజాకార్లతో ప్రత్యేక దళం ఉండేది.
జిల్లాల్లో పరిస్థితులను పరిశీలించడానికి ప్రతీ జిల్లాలోనూ ఒక్కో కమిటీ ఏర్పాటు చేసారు. జిల్లా కలెక్టర్, ఎస్పితో పాటు రజ్వీ సిఫారసు చేసిన వ్యక్తులు ఆ కమిటీలో ఉండేవారు. పట్టణాలు, గ్రామాల్లో రజాకార్ల నియామకానికి సహకరించాలంటూ తాలూకా అధికారులను ఆదేశించారు. అలా కొత్తగా నియమించుకున్న రజాకార్లకు రిటైర్ అయిన సైనిక, పోలీసు అధికారులు 21రోజుల పాటు లూటీలు, గృహ దహనాలు, ఆయుధాల వాడకం గురించి శిక్షణ ఇచ్చేవారు.
1948 జనవరి నాటికి హైదరాబాద్‌లో రజాకార్ వాలంటీర్లుగా నమోదు చేసుకున్నవారు 30వేలమంది. ఆగస్టు నాటికి ఆ సంఖ్య లక్షకు పెరిగింది. రాయచూరు, గుల్బర్గా జిల్లాల్లో ప్రత్యేక దళాలుండేవి. ఇత్తేహాద్ (ఎంఐఎం)కు సొంత రవాణా విభాగం ఉండేది. అందులో పెద్దసంఖ్యలో లారీలు, జీపులు, ట్రక్కులు ఉండేవి. హైదరాబాద్ ప్రభుత్వ రేడియో సర్వీసును ఇత్తేహాద్ తమ కార్యక్రమాల ప్రసారానికి పూర్తిగా వాడుకునేది. ఇంకా ఎంఐఎంకు ఉర్దూలో ఆరు వారపత్రికలు, ఏడు దినపత్రికలు ఉండేవి. వాటి నిండా రజ్వీ ప్రసంగాలు ప్రచురించేవారు. ఇస్లామిక్ దేశాల నుంచి హైదరాబాద్‌కు సాయం కోరుతూ రజ్వీ ప్రసంగాలు చేసేవాడు.
రజాకార్ వలంటీర్లకు నిర్దిష్టమైన కార్యకలాపాలు చేయాలని ఆదేశాలుండేవి. అవేంటంటే…
– సంస్థానం అంతటా బహిరంగ సభలు నిర్వహించడం, వాటిద్వారా హిందువులను భయభ్రాంతులను చేయడం
– ఆర్యసమాజ్, ఆర్ఎస్ఎస్, హిందూమహాసభ సభ్యులను, జాతీయవాదులను చిత్రహింసలు పెట్టడం
– బాధ్యతాయుతమైన ప్రభుత్వం కావాలని అడిగేవారిని వేధించడం
– గ్రామాలు, పట్టణాలపై దాడులు చేయడం, అరాచకాలకు పాల్పడడం
– గ్రాసమస్తులనుంచి రెవెన్యూ (కరోడ్గిరీ) వసూలు చేయడం
– మహిళలపై అత్యాచారాలు చేయడం, స్త్రీపురుషులను హత్యచేయడం
– హిందువుల ఇళ్ళు, దుకాణాలను దోచుకోవడం, తగులబెట్టడం
– హిందువులను బలవంతంగా ఇస్లాంలోకి మతం మార్చడం
– కాంగ్రెస్ సభ్యులను వేధించడం
రజాకార్ల దురాగతాలు గ్రామస్థాయి వరకూ వ్యాపించాయి. బేలూరు రజాకార్లు గొర్త గ్రామంలోని లక్ష్మీదేవి మందిరం ముందు రసూల్ అనే నాయకుడి ఆదేశాల మేరకు బసప్ప, అన్నప్ప అనే గ్రామస్తులను పాశవికంగా చిత్రహింసలు పెట్టిమరీ చంపేసారు. గురుపాదప్ప, రాంరావు పట్వారీ, నారాయణరావు మోక్తేదార్, బసప్ప మలీపాటిల్లను పట్టుకుని జంతువులను వేటవేసినట్టు నరికి చంపేసారు. ఆ ఘాతుకాలతో భయపడిపోయిన గ్రామస్తులు సుమారు 800 మంది మహుదుప్ప దుమానే ఇంట్లో తలదాచుకున్నారు. కాశప్ప భాల్కే, నాగప్ప హులెంబర్ వంటి స్థానిక నాయకుల వద్ద రైఫిళ్ళు ఉండేవి. వాటితో వారు రోజంతా రజాకార్లతో పోరాడారు. ఆ ఘర్షణలోనే చన్నప్ప బిరాదార్, మారుతి కోనే, మల్లప్ప జగశెట్టి హతులయ్యారు. గ్రామస్తులు రజాకార్ల మీద వివిధ దిశల నుంచి రాళ్ళు రువ్వి వారిని గాయపరిచేవారు.
రజాకార్ల దురాగతాలు ఎంత దారుణంగా ఉండేవంటే.. వారు ఒక యువకుణ్ణి నిర్బంధించారు. నిండు గర్భిణీ అయిన అతని అక్కగారు తన తమ్ముణ్ణి చంపవద్దంటూ కాళ్ళావేళ్ళా ప్రాథేయపడింది. వారామెను పొట్ట మీద ఎలా తన్నారంటే ఆ మహిళ అక్కడికక్కడే చనిపోయింది, ఆమె కడుపులోని బిడ్డ గర్భంలోనుంచి నేల మీదకు రాలిపోయింది. అలాంటి రాక్షసుల నుంచి ప్రాణాలు కాపాడుకోడానికి గ్రామస్తులు సురక్షితం అని భావించే ప్రదేశాలకు రాత్రిపూట్ల పారిపోయేవారు. అలాంటి సందర్భాల్లో సిద్ద వీరాస్వామి, రాచోట శివాచార్య, సురేష్ స్వామి హీరేమఠ్, గురుపాద శివాచార్య తదితరులు బాధితులకు ఆహారం, ఆశ్రయం కల్పించేవారు.
ఆ మరునాడే రజాకార్లు మళ్ళీ గొర్త గ్రామానికి వెళ్ళి దుమానే ఇంటిమీద దాడి చేసి దోచుకున్నారు. గ్రామం మొత్తం ఖాళీ అయిపోయింది. ప్రజలు శరణార్థి శిబిరాల్లో తలదాచుకున్నారు. వీధుల్లో శవాలు, అస్తిపంజరాల కుప్పలుగా పడిఉండేవి. గొర్త గ్రామంలో 2వందల మంది గ్రామస్తులను దారుణంగా హత్య చేసారు. ఆ శవాలకు అంతిమ సంస్కారాలు కాదు కదా, కనీసం చూసేవారైనా లేరు. హృదయవిదారకమైన ఆ విషాదకర విషయం తెలుసుకున్న ఆచార్య వినోబా భావే, స్వామీ రామానంద తీర్థ, కెఎం మున్షీ ఆ గ్రామాన్ని సందర్శించారు, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు. గొర్త గ్రామంలో రజాకార్ల ఘాతుకం గురించి విన్న జవాహర్లాల్ నెహ్రూ కళ్ళనుంచి నీళ్ళు జలజలా రాలాయట.
1947లో చిత్గుప్ప అనేచోట జాతీయజెండా ఎగురవేసే కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఆ విషయం తెలుసుకున్న రజాకార్లు వారిపై దాడిచేసారు. అప్పన్న, గుండప్ప అనే ఇద్దరిని చంపేసారు. ఆర్వీ బిదప్ప తండ్రి అయిన శ్రీ వీరభద్రప్ప తీవ్రంగా గాయపడ్డారు. ఉద్గిర్-దొనగావ్ ప్రాంతంలోనూ రజాకార్ల ఆగడాలకు అంతులేదు. ఉద్గిర్ పరిధిలోని తోర్నాలో యాకూబ్ అనే రజాకారు ప్రజలను హింసించేవాడు. దొనగావ్ గ్రామానికి చెందిన చాన్విర్, మానిక్‌రావు మూలే అనే ఇద్దరు సాహసవంతులైన యువకులు యాకూబ్‌ను బంధించి అతని కళ్ళు పెరికేసారు. రెండు నెలల తర్వాత వారిని అరెస్ట్ చేసారు. 1948 పోలీసు చర్య తర్వాత వారిని తిలక్ చాంద్ సహాయంతో విడుదల చేసారు. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో 1947-48 సమయంలో రజాకార్ల అత్యాచారాలతో సుమారు 150మంది మహిళలు, బాలికలు ఆత్మహత్య చేసుకున్నారు. రజాకార్లు అత్యాచారం చేస్తున్న ఒక మహిళను రక్షించిన ఆర్యసామాజికుడు హుమానాబాద్కు చెందిన రామచంద్ర వీరప్పను రజాకార్లు దాదాపు చంపినంత పనిచేసారు.
గుల్బర్గ జిల్లాలో కూడా 1947, 1948మ సంవత్సరాల్లో రజాకార్లు పాల్పడిన ఘాతుకాలు అన్నీఇన్నీ కావు. మహగావ్, హెబ్బాళ, కమలాపురం, చించోలి, కాడాగంచి, నింబార్గ, గంగాపూర్, రత్కల్, కురికోట, యెల్సంగి సరసాంబ, కల్గి, జేవర్గి, అలంద్ వంటి గ్రామాల్లో రజాకార్ల ఆగడాలు కొనసాగాయి.
రజాకార్లు యెల్సంగి గ్రామం మీద పడి దోచుకున్నారు. ప్రతీ ఇంటిలోనూ వస్తువులు, నగదు, బంగారం, ఆహారధాన్యాలు అన్నింటినీ లూటీ చేసారు. గ్రామస్తులు షోలాపూర్ శరణార్థి శిబిరంలో తల దాచుకున్నారు. సురపురంలో రజాకార్లు విరూపాక్షప్ప, మహంతగౌడ్లను హత్యచేసారు. 1948 సెప్టెంబర్ 4న రజాకార్లు అలంద్‌లో 42మంది అమాయక గ్రామస్తులను ఏ కారణమూ లేకుండా చంపేసారు. సెప్టెంబర్ 17న అదే గ్రామంలో మరో 9మందిని కాల్చిచంపారు.
రాయచూరు గ్రామంలో 1947, 1948 సంవత్సరాల్లో హత్యలు, అత్యాచారాలు, లూటీలు నిత్యకృత్యమయ్యాయి. కొప్పాళ, గుడిగెరె, కోలూరు, కవలూరు, మాన్వి, కుకునూరు, బెలాగట్టి, బనపూర్, కిన్నల్, సుది, కర్తగి తదితర గ్రామాలను రజాకార్లు ముట్టడించారు. రాయచూరులోని సోమవారపేటలో సావిత్రి సుగయ్య నివాసం నుంచి రూ.60వేలు లూటీ చేసారు. తిమ్మాపూర్‌పేటలో 60 గుడిసెలను తగులబెట్టేసారు. రాయచూరు పోలీసు కాలనీ దగ్గర ఇద్దరు హిందువులను చంపేసారు.
1947 ఆగస్టు 15న కిన్నల్, కొప్పాళ, యెల్బర్గ కుకునూరు, నావలీ కుష్తగి తదితర ప్రాంతాల్లో జాతీయజెండా ఎగురవేసారు. ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న సిద్దప్ప, పంచాక్షరి హిరేమఠ్, శ్యామ్‌రావు దేశాయ్, రాజా పింజర్, సుది రాచప్ప వంటి జాతీయవాదులు, ఆర్యసామాజికులను రజాకార్లు అరెస్ట్ చేసారు.
మలాగట్టి గ్రామంలో రజాకార్లు ప్రజల ఇళ్ళన్నీ లూటీ చేసారు. మహిళలను మానభంగం చేసారు. స్వాతంత్ర్య సమరయోధులకు రహస్య సమాచారం అందిస్తున్నారన్న అనుమానంతో షావమ్మ, ఆమె కూతురు లక్ష్మవ్వలను దారుణంగా చంపేసారు. అలవండి మఠాన్ని దోచుకుని దానికి సంబంధించిన పత్రాలన్నీ తగులబెట్టేసారు. రాయచూరులోని హెంబెరాళ్ గ్రామంలో జాతీయజెండా ఎగురవేసిన శాంతరాస అనే వ్యక్తిని పోలీసులు కుళ్ళబొడిచారు.
కొప్పాళ సరిహద్దుల్లోని కవలూరు గ్రామాన్ని కూడా రజాకార్లు పూచికపుల్లయినా మిగల్చకుండా దోచుకున్నారు. గ్రామంలోని ఆడవారి మంగళసూత్రాలను సైతం తెంపుకెళ్ళారు. ముగ్గురు వ్యక్తులను చంపేసారు.
గంగావతి తదితర ప్రాంతాల్లో 1947 ఆగస్టు 15న జాతీయజెండా ఎగరేసారు. దానికి సంబంధించి బెనకల్ భీమసేన్ రావు దేశాయి తదితరులను అరెస్ట్ చేసి గుల్బర్గా జైలులో నిర్బంధించారు. భీమసేన్ రావు జైల్లో ఉండగానే చనిపోయాడు.
నిజాం నవాబును కీలుబొమ్మ చేసుకుని కాసిం రజ్వీ నాయకత్వంలో రజాకార్లు పాల్పడిన అఘాయిత్యాలు, అత్యాచారాల్లో ఇవి కొన్ని మాత్రమే.