టిబెట్ గురించి ప్రపంచం దృష్టి తాను చెప్పే విధంగానే ఉండాలనే ప్రయత్నాల్లో చైనా మరో ముందడుగు వేసింది. లాసా నగరంలో ‘టిబెట్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ సెంటర్’ను చైనా ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించింది. టిబెట్ తమ భూభాగమే అని ప్రపంచానికి చాటిచెప్పే క్రమంలో తాజాగా చేసిన ప్రయత్నమే ఈ కేంద్రం ఏర్పాటు అని ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ ఫర్ టిబెట్ (ఐసిటి) వెల్లడించింది.
టిబెట్ భూభాగంలో అటువంటి సంస్థలను ఏర్పాటు చేయడం టిబెట్ తమదేనంటూ చైనా చేసే ప్రచారానికి మరింత ఊతమిస్తుందని ఐసిటి భావించింది. భవిష్యత్తులో చైనా మరింత దూకుడుగా ముందుకు వెడుతుందని, టిబెట్ గురించి చైనా చెప్పే కథలనే ప్రపంచం నమ్మే పరిస్థితులు మరింత బలపడే ప్రమాదముందనీ ఐసిటి ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ యేడాది జనవరిలో ‘చైనాస్ ఎక్స్‌టెర్నల్ ప్రాపగాండా ఆన్ టిబెట్: ఎరేజింగ్ టిబెట్ టు టెల్ ఎ గుడ్ చైనీస్ స్టోరీ’ పేరుతో ఐసిటి ఒక నివేదిక విడుదల చేసింది. ‘‘1959లో టిబెట్‌పై చైనా దండయాత్ర చేసి, ఆ తర్వాత ఆక్రమించిన నాటి నుంచీ టిబెట్ విషయంలో చైనా విధానం అంతర్జాతీయ పరిశీలనలో ఉంది. టిబెట్‌లో రాజకీయ సమస్య ఉందని చైనా ప్రభుత్వానికి తెలుసు. దాన్ని పరిష్కరించడానికి బదులు, అక్కడి పరిస్థితిని ప్రపంచం ముందు తప్పుగా చూపిస్తోంది. టిబెట్ విషయంలో తమ ప్రచారం మాత్రమే వ్యాప్తిలో ఉండాలని వివిధ పద్ధతులను ఉపయోగిస్తోంది. అలా, ప్రపంచంలో టిబెట్ చరిత్రను మార్చేయడమే లక్ష్యంగా పని చేస్తోంది. చైనా ఇటీవల టిబెట్ గురించి ఇతర దేశాల్లో చేస్తున్న ప్రచార ప్రయత్నాలను పరీక్షిస్తుంది, దాని లక్ష్యాలు, వ్యూహాలను బైటపెడుతుంది’’ అని ఆ నివేదిక పేర్కొంది.
టిబెట్ గురించి ప్రభావశీలంగా అంతర్జాతీయ సమాచార వ్యవస్థను నిర్మించడం గురించి ఓ రౌండ్ టేబుల్ మీటింగ్‌లో చర్చించిన తర్వాత చైనా ఏర్పాటు చేసినదే తాజా ప్రచార కేంద్రమని ఐసిటి నివేదిక స్పష్టం చేసింది. ఆ కేంద్రాన్ని టిబెట్ అటానమస్ రీజియన్ పార్టీ కమిటీ, చైనా ఫారిన్ లాంగ్వేజ్ బ్యూరో సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి చైనా కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్‌బ్యూరో కేంద్ర కమిటీ 2021 మే నెలలో నిర్వహించిన గ్రూప్ స్టడీ సెషన్ ఫలితంగా ఈ కేంద్రం రూపుదిద్దుకుంది. ఇప్పుడు ఈ కేంద్రం లక్ష్యం… ప్రపంచానికి తెలిసిన ‘టిబెట్’ అనే దేశం పేరును ‘షిజాంగ్’ అని మార్చేయడం, ఆ కొత్త పేరును క్రమంగా ప్రపంచం మీద రుద్దడం, కొన్నాళ్ళకు అది చైనా అంతర్భాగమే అని ప్రపంచం అంతా నమ్మేలా చేయడం… అని ఐసిటి చెబుతోంది. 2021 చివరిలో, ప్రపంచం మొత్తం కోవిడ్ 19 మహమ్మారి కోరల్లో చిక్కుకుని ఉన్న సమయంలో ఈ పేరు మార్పిడి వ్యూహాన్ని చైనా ప్రారంభించింది. అంతర్జాతీయ వేదిక మీద ‘అద్భుతమైన చైనీస్ కథ’ చెప్పాలన్న చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి షి జింపింగ్ దశాబ్దకాలపు దార్శనికతకు ఈ పేరు మార్పిడి కథ నిదర్శనంగా నిలుస్తుంది. త్వరలోనే చైనా తన ప్రభుత్వ అధీనంలోని మీడియా ద్వారా టిబెట్ గురించి తమ దృక్పథాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేస్తుంది’’ అని ఐసిటి పేర్కొంది.
టిబెట్ మీద జరుగుతున్న అణచివేతను దాచివేయడం, టిబెట్ గురించి పోరాడే గొంతుకలను బలహీనపరచడం వంటి పనులకు కూడా ఈ కేంద్రాన్ని ఉపయోగించుకుంటారని ఐసిటి ఆందోళన వ్యక్తం చేస్తోంది.