తమిళనాడు తిరునల్వేలి జిల్లా సూరండై పట్నం శంకరన్‌కోయిల్ రోడ్డులోని ఒక చిన్న హోటల్ ఇప్పుడు దేశవ్యాప్త వివాదానికి కేంద్రబిందువయింది. దేశంలో ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలనే అజెండాతో పనిచేస్తున్న ఎస్‌డిపిఐ పార్టీ నోటిమాటగా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆ హోటల్ యజమానులను బెదిరించడం వివాదాస్పదమైంది. శాకాహారం, మాంసాహారం రెండూ విక్రయించే ఆ హోటల్ కేవలం పోలీసుల చర్య మూలంగా వార్తల్లోకెక్కింది. ఆ సంఘటన తమిళనాడులో కోవిడ్ తర్వాత ముదిరిన ఒక ధోరణికి నిదర్శనంగా నిలిచింది. రాష్ట్రంలో ముస్లిమేతరులు నిర్వహించే భోజనశాలలు, హోటళ్ళు, రెస్టారెంట్లు అన్నింటిలోనూ అలిఖితంగానే అయినా, హలాల్ సర్టిఫికేషన్ తప్పనిసరిగా పొందాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ హలాల్ సర్టిఫికెట్లను కనిపించేలా ప్రదర్శించాలి, ముస్లిం పనివారిని తప్పనిసరిగా పెట్టుకోవాలి, వారితో ప్రతీరోజూ ఆహార పదార్ధాలను హలాల్ చేయించాలి. ఇంక ఈ హలాల్ సర్టిఫికెట్ పొందడానికి భారీగా రుసుము చెల్లించాలి కూడా.
సూరండై పట్నంలోని ‘హోటల్ శరవణ’ యజమాని సెల్వ గణపతి తన హోటల్ ముందు ‘హలాల్ చేయబడని ఆహారం లభిస్తుంది’ అని బోర్డ్ పెట్టారు. అందుకే అతన్ని ముస్లిములు, పోలీసులు వేధించారు. తమిళనాడులోని ప్రముఖ్ యూట్యూబర్ గణేశన్ ఈమధ్య సెల్వ గణపతిని ఇంటర్వ్యూ చేసారు. ఆ ఇంటర్వ్యూలో సెల్వ గణపతి తన పరిస్థితి గురించి వివరించి చెప్పారు. ఏ అర్ధరాత్రి సమయంలోనో ఏవో ముస్లిం దేశాల నుంచి ఫోన్ కాల్స్ వచ్చేవని, తనను ఎవరు ప్రేరేపిస్తున్నారు, హలాల్ చేయకుండా ఎందుకు విక్రయిస్తున్నావంటూ దూషిస్తూ మాట్లాడేవారనీ వివరించారు. స్థానిక ముస్లిములు, పోలీసుల నుంచీ ఎదురైన వేధింపుల గురించి కూడా చెప్పుకొచ్చారు.
నిజానికి సెల్వ గణపతి ఉద్దేశం చాలా సరళంగా ఉంది. తన హోటల్‌కు వచ్చే ముస్లిం వినియోగదారులకు తమ ఆహారం హలాల్ చేయబడనిది అని తెలియజేయడం మాత్రమే తన ఉద్దేశమని ఆయన చెప్పారు. దాన్ని బట్టి వారు తన హోటల్లో తినాలా వద్దా అనే విషయాన్ని నిర్ణయించుకోగలుగుతారని వివరించారు. అంతేతప్ప ఎవరి మతపరమైన సెంటిమెంట్లనూ అగౌరవపరిచే ఉద్దేశం తనకు లేదని ఆయన స్పష్టం చేసారు.
తన హోటల్లో ఆహారం హలాల్ చేయబడనిది అనే విషయాన్ని ముందుగానే కస్టమర్లకు తెలియజేస్తే, వారు తమ అభిరుచుల ప్రకారం అక్కడ తినాలా వద్దా అన్నది నిర్ణయించుకోగలుగుతారు. కేవలం హలాల్ చేసిన ఆహారం మాత్రమే తినాలనుకునేవారికి అసౌకర్యం కలగకుండా ఉంటుందని సెల్వ గణపతి అభిప్రాయం. నిజానికి ఆయన నిజాయితీని, పారదర్శకంగా వ్యవహరిస్తున్న తీరునూ అభినందించాలి. కానీ అతనికి ‘నాన్-హలాల్’ అన్న బోర్డు తీసేయాలంటూ పోలీసుల నుంచి ఒత్తిళ్ళు విపరీతంగా వస్తున్నాయి. అతను ఎన్నిసార్లు వివరించినప్పటికీ దాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. కస్టమర్లకు సరైన సమాచారం అందించాలనే సదుద్దేశాన్ని తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు.
‘‘మా పట్టణం అసలు పేరు శివగురునాథన్పురం. ఇక్కడ మెజారిటీ జనాభా హిందువులు. ముస్లిములు చాలా తక్కువ. ఇక్కడ చాలావరకూ హోటళ్ళు, మాంసం కొట్లూ హిందువులవే. ఆ వ్యాపారాల్లో ముస్లిముల సంఖ్య చాలా తక్కువ. కోళ్ళను మేమే పెంచుతాం. అలాగే మేకమాంసాన్ని నాకు తమ్ముడి వరసయ్యే బంధువే కోస్తాడు. ముస్లిములు మాంసం కోసేటప్పుడు ఏవో ప్రార్థనలు చేస్తారని, అది వారి మతధర్మమనీ విన్నాను. అయితే దాని గురించి నాకు పూర్తిగా తెలియదు.’’
‘‘కొన్నాళ్ళ క్రితం మా ఊరికి దగ్గరలోని కడయనల్లూరు నుంచి నలుగురైదుగురు ముస్లింలు మా హోటల్‌కు వచ్చారు. అరిటాకులు వేసి అన్నం వడ్డించేవరకూ వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. కూర వడ్డించే సమయంలో దాన్ని హలాల్ చేసారా అని అడిగారు. లేదని చెప్తే వారు తినడానికి నిరాకరించారు. మా హోటల్లో ఆహారం బాగుంటుందనీ, రుచి చూడమనీ మేం సూచించాం. కానీ వాళ్ళు తినబోమని తేల్చేసారు. ఎందుకలా అని విచారిస్తే, వాళ్ళు కేవలం హలాల్ చేసిన ఆహారం మాత్రమే తింటారట. ఇక్కడ ఆహారం హలాల్ చేయబడదు అని ఒక బోర్డు పెట్టమని వాళ్ళు నాకు సలహా ఇచ్చారు. హలాల్ ఫుడ్ గురించి నాకు మొదటిసారి తెలిసింది అప్పుడే. ఆ తర్వాత, భవిష్యత్తులో మా కస్టమర్లకు ఎలాంటి సందేహమూ ఉండకూడదని నేను ఈ బోర్డు పెట్టాను’’ అని సెల్వ గణపతి వివరించారు.
ప్రతీ ఒక్కరికీ తమ మతాన్ని బట్టి కొన్ని పద్ధతులు, నమ్మకాలు ఉంటాయి. వాటిని గౌరవించాలి. మా హోటల్లో అనుసరించే పద్ధతుల గురించి నిజాయితీగా చెబుతాను తప్ప కస్టమర్లను మోసం చేయడం, తప్పుదోవ పట్టించడం చేయకూడదు. అందుకే ఈ బోర్డు పెట్టాను. అది పెట్టిన 15-20 రోజుల తర్వాత నాకు అర్ధరాత్రి వేళల్లో ఫోన్ కాల్స్ రావడం మొదలైంది. వారు తాము విదేశాల నుంచి కాల్ చేస్తున్నామని చెప్పేవారు. నాన్ హలాల్ బోర్డు ఎందుకు పెట్టావంటూ ప్రశ్నించేవారు. నా కారణాలు నేను వివరించేవాణ్ణి. కానీ కొంతమంది దాన్ని అడ్డం పెట్టుకుని మతపరమైన ఉద్రిక్తతలు కల్పించడానికి ప్రయత్నించారు’’ అని సెల్వ గణపతి వెల్లడించారు.
ముస్లిం రాజకీయ నాయకుల నుంచి, పోలీసుల నుంచి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా సెల్వ గణపతి తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. తాను ఇతరుల నమ్మకాలను గౌరవిస్తున్నాననీ, తన కస్టమర్ల వద్ద పారదర్శకంగా వ్యవహరిస్తున్నాననీ సెల్వ గణపతి స్పష్టం చేసారు.
ఇప్పుడు సెల్వ గణపతి మీద పోలీసులు ఆ బోర్డు తీసేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. అతని హోటల్‌ను పడగొట్టేస్తామని బెదిరిస్తున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించాడనో, ఆరోగ్య విభాగం లేదా ఫుడ్ సేఫ్టీ విభాగం ద్వారానో హోటల్ మూయించేస్తామని బెదిరిస్తున్నారని సెల్వ గణపతి వెల్లడించారు. ఆ బోర్డును మార్చి ‘ఇక్కడ హలాల్ ఆహారం దొరుకుతుంది’ అనే బోర్డు పెట్టాలనీ, లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందనీ పోలీసులు తనను హెచ్చరించారని సెల్వ గణపతి ఆవేదన వ్యక్తం చేసారు.