ఢిల్లీలో 1984లో సిక్కుల ఊచకోత కేసుకు సంబంధించి రోజ్ ఎవెన్యూ కోర్టు ఇవాళ కాంగ్రెస్ నాయకుడు జగదీష్ టైట్లర్ మీద విచారణ ప్రారంభించింది. నిర్దిష్టంగా చెప్పాలంటే, 1984 నవంబర్ 1నాడు పుల్ బంగష్ గురుద్వారా వద్ద ముగ్గురు సిక్కులను హత్య చేసి, అల్లర్లు రెచ్చగొట్టిన కేసులో జగదీష్ టైట్లర్ పాత్ర మీద విచారణ మొదలైంది. టైట్లర్ ఇవాళ కోర్టుకు హాజరయ్యారు. తన మీద చేసిన ఆరోపణలను ఖండించారు.
సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి రాకేష్ స్యాల్ తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసారు. ఆరోజు సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేస్తారు. మొదటి సాక్షిగా లఖ్వీందర్ కౌర్‌ను విచారిస్తారు. ఆమె భర్త బాదల్‌సింగ్ ఆరోజు హత్య చేయబడిన ముగ్గురిలో ఒకరు.
ఆ రోజు అల్లరి మూకను రెచ్చగొట్టి గురుద్వారాపై దాడి చేయించింది, గురుద్వారాను తగులబెట్టించింది, ముగ్గురు సిక్కులను హత్య చేయించిందీ టైట్లరే అనడానికి తగిన పరిస్థితులు ఉన్నాయని కోర్టు ఆగస్టు 30న వెల్లడించింది.
పుల్ బంగష్ గురుద్వారా దహనం, ముగ్గురు సిక్కుల హత్య కేసులో కాంగ్రెస్ నాయకుడు జగదీష్ టైట్లర్‌కు వ్యతిరేకంగా కేసు నమోదు చేయాలని రోజ్ ఎవెన్యూ కోర్ట్ ఆదేశించింది.
అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య తర్వాత ఢిల్లీలో సిక్కుల ఊచకోత చోటు చేసుకుంది. కాంగ్రెస్‌లో అప్పటి యువ నాయకుడైన జగదీష్ టైట్లర్ దగ్గరుండి అల్లర్లు, హింసాకాండ జరిపించారు. ప్రత్యేకించి పుల్ బంగష్ గురుద్వారా దహనం, ముగ్గురు సిక్కుల హత్య కేసుకు సంబంధించి టైట్లర్‌కు వ్యతిరేకంగా సిబిఐ 2023 మే 20న సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. 2023 జులై 26న అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ విధి గుప్తా ఆనంద్, జగదీష్ టైట్లర్‌కు సమన్లు జారీ చేసారు. ‘‘నేను సప్లిమెంటరీ చార్జిషీట్, కేసు రికార్డు, ప్రత్యక్ష సాక్షులు, ఇతర సాక్షుల ప్రకటనలను అధ్యయనం చేసాను. ఈ కేసులో ముందుకు సాగడానికి తగినంత సమాచారం ఉంది’’ అని ఆమె వ్యాఖ్యానించారు.
1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీ హత్య తర్వాత ఢిల్లీలో సిక్కుల ఊచకోత చోటు చేసుకుంది. ఆ కేసుకు సంబంధించి జగదీష్ టైట్లర్ మీద సిబిఐ 2023 మే 20న ఛార్జిషీట్ దాఖలు చేసింది. టైట్లర్ ఆ సందర్భంగా కోర్టుకు హాజరయ్యారు. ఆ తర్వాత ఆగస్టు 5న ఆయనకు బెయిల్ మంజూరైంది.
1984 నాటి సిక్కుల ఊచకోత సంఘటనపై విచారణ జరపడానికి భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో జస్టిస్ నానావతి కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ నివేదికను పరిశీలించిన కేంద్ర హోంశాఖ, ఆ కేసు విచారణకు సిబిఐకి అప్పగించింది. సిబిఐ దర్యాప్తులో 1984 నవంబర్ 1న పుల్ బంగష్ గురుద్వారా దగ్గర గుమిగూడిన అల్లరి మూకను జగదీష్ టైట్లర్ తన మాటలతో రెచ్చగొట్టి గురుద్వారాను తగులబెట్టించాడని, ఆ గొడవల్లోనే ముగ్గురు సిక్కులను చంపేసారనీ ఆధారాలు లభించాయి. గురుద్వారా పరిసర ప్రాంతాల్లో ఉన్న దుకాణాలను కూడా లూటీ చేసి, తగులబెట్టేసారు.