కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తన అమెరికా పర్యటనలో భారతదేశానికి వ్యతిరేకంగా చేస్తున్న దుష్ప్రచారాన్ని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ వాస్తవిక సమాచారంతో ఖండించారు. దేశపు ప్రస్తుత, భవిష్యత్ పరిస్థితిని స్థూలంగా వివరించారు. వివిధ రంగాల్లో దేశం సాధిస్తున్న పురోగతిని వెల్లడించారు, తద్వారా భారత్ స్థితిగతుల గురించి రాహుల్ వ్యాపింపజేస్తున్న సమాచారంలోని తప్పులను బైటపెట్టారు.
గణనీయంగా పెరుగుతున్న భారత ఆర్ధిక వ్యవస్థ గురించి జయశంకర్ వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థ 8శాతం వృద్ధిరేటుతో 4లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుకుంటోంది. దేశంలో ముందెన్నడూ లేనంత వేగంగా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఏటా ఏడెనిమిది విమానాశ్రయాలు, ఒకట్రెండు మెట్రో స్టేషన్ల నిర్మాణం జరుగుతోంది. ఇంక జాతీయ రహదారులు, రైల్వేల సంగతి చెప్పనే అక్కరలేదు. రోజుకు 28 కిలోమీటర్ల జాతీయ రహదారులు, 12 కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌లు నిర్మాణమవుతున్నాయి.
డిజిటైజేషన్లో భారత్ సాధిస్తున్న అద్భుతాల గురించి జయశంకర్ వివరించారు. డిజిటల్ అడ్వాన్స్మెంట్స్లో భారత్ గ్లోబల్ లీడర్ స్థాయికి చేరుకుంది. డిజిటల్ ఆర్థిక లావాదేవీల్లో భారత్ రికార్డులు సృష్టిస్తోంది. నెలకు సుమారు 130 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ డిజిటల్ విప్లవం ప్రజా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. 17కోట్ల మందికి ఇళ్ళు నిర్మించే కార్యక్రమంలో, 66 కోట్ల మందికి ఆరోగ్య పథకాలు అందించే కార్యక్రమంలో డిజిటల్ విప్లవం కీలకంగా నిలిచింది. ఇంకా, చిన్నవ్యాపారాలకు ఆర్థిక సాయంగా కేంద్ర ప్రభుత్వం ఏటా 5800 కోట్ల డాలర్లు అందించింది.
భారతదేశంలో అంకుర సంస్థలు గణనీయంగా అభివృద్ధి చెందాయి. ప్రస్తుతం ప్రపంచంలో స్టార్టప్ కంపెనీలు అతి ఎక్కువ ఉన్న దేశాల్లో భారత్ మూడోస్థానంలో ఉంది. వాటిలో 117 యూనికార్న్ సంస్థలు ఉండడం విశేషం. గత దశాబ్ద కాలంలో భారత్‌లోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల సంఖ్య రెట్టింపు అయింది. విద్యారంగంలో మౌలిక సదుపాయాల పెరుగుదల, విద్య నాణ్యత మెరుగుదల కారణంగా ప్రజలకు ఉన్నత విద్య మరింత చేరువయింది.
ప్రపంచ వేదికపై భారతదేశం పాత్ర ఆర్థికాభివృద్ధిని దాటిపోయింది. భారతదేశం వ్యాక్సిన్లు, ఔషధాల తయారీలో ప్రపంచంలో అగ్రస్థాయికి చేరుకుంది, తద్వారా ప్రపంచ ఆరోగ్య పరిరక్షణలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. సెమీకండక్టర్ పరిశ్రమలోను, కాంట్రాక్ట్ ఇంజనీరింగ్ రంగంలోనూ భారత్ గణనీయమైన వృద్ధి నమోదు చేస్తోంది. ఇంక రోదసీ పరిశోధనల్లో భారత్ విజయాలు అనుపమానమైనవి. చంద్రయాన్, గగన్‌యాన్, మంగళ్యాన్ వంటి ప్రాజెక్టులతో శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది.
ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అంతర్జాతీయ వేదికల ద్వారా భారత్ మీద చేస్తున్న విమర్శలు అర్ధరహితమైనవి. ఆ విమర్శలను తిప్పికొడుతూ జయశంకర్ ఇచ్చిన వివరణ వివిధ రంగాల్లో భారత్ సాధించిన, సాధిస్తున్న అభివృద్ధిని సోదాహరణంగా వివరించింది. ఆయారంగాల్లో ఇంకా ఎంతో కృషి జరగాల్సి ఉన్న మాట వాస్తవమే అయినా, దేశం ఇప్పటివరకూ సాధించిన ప్రగతిని, ప్రపంచ దేశాల్లో భారత్‌ను కీలక స్థానంలో నిలబెట్టిన తీరును ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే.