మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ – ముడా కుంభకోణం కర్ణాటకలో పెద్ద రాజకీయ వివాదంగా నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వానికీ గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్‌కూ మధ్య దాదాపు యుద్ధమే జరుగుతోంది. తాజాగా గవర్నర్ ఆ వ్యవహారం గురించి భారత రాష్ట్రపతికి, కేంద్ర హోంశాఖకూ సమగ్ర నివేదిక సమర్పించారు. కుంభకోణంపై నిరసనల గురించీ, రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న ఒత్తిడి వ్యూహాల గురించీ ఆందోళన వ్యక్తం చేసారు.
ముడా కుంభకోణంలో ప్రమేయమున్న వ్యక్తులను ప్రోసిక్యూట్ చేసేందుకు గవర్నర్ గెహ్లోత్ అనుమతి ఇవ్వడంతో వివాదం మొదలైంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్‌లు గవర్నర్ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేసారు. దాన్ని చట్టపరంగా సవాల్ చేసారు. గెహ్లోత్ నిర్ణయాన్ని రాజకీయ కుట్రగా వారు భావించారు. దాంతో రాజ్‌భవన్, కర్ణాటక ప్రభుత్వాల నడుమ ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి.
గవర్నర్ గెహ్లోత్ రాష్ట్రపతికి సమర్పించిన నివేదికలో రాష్ట్రంలోని అనిశ్చిత పరిస్థితిని ప్రధానంగా ప్రస్తావించారు. ఒకవైపు ప్రభుత్వమూ, మరోవైపు కాంగ్రెస్ నాయకులూ ఆందోళనలు చేస్తున్నారనీ దానివల్ల ప్రభుత్వ కార్యక్రమాలు కుంటుపడ్డాయనీ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తన దిష్టిబొమ్మలు తగులబెట్టారనీ, రాజ్‌భవన్‌ను చుట్టుముడతామంటూ బెదిరించారనీ కూడా వెల్లడించారు. గవర్నర్ చర్యలను కాంగ్రెస్ రాజకీయ పక్షపాత ధోరణిగా పరిగణిస్తుండడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తింది.
గవర్నర్ గెహ్లోత్ తన వ్యక్తిగత రక్షణకు కూడా సమస్యలు తలెత్తాయని తెలియజేసారు. ఇంటలిజెన్స్ విభాగం సలహా మేరకు ఆయనకు బులెట్‌ప్రూఫ్ వాహనం ఏర్పాటు చేసారు. రాష్ట్రప్రభుత్వానికి చెందిన కొందరు మంత్రులు, మరికొందరు కాంగ్రెస్ నాయకులు ‘గో బ్యాక్ గవర్నర్’ అంటూ ప్రచారం సాగించిన సంగతిని కూడా గవర్నర్ తన నివేదికలో పేర్కొన్నారు.
గవర్నర్ నివేదిక, రాష్ట్రంలో పరిస్థితి అదుపు తప్పుతోందనడానికి స్పష్టమైన సూచికగా నిలిచింది. రోజురోజుకూ ముదురుతున్న రాజకీయ సంక్షోభం గురించి గవర్నర్ కేంద్ర హోంశాఖకు, రాష్ట్రపతికీ తెలియజేసారు. అధికార కాంగ్రెస్ పార్టీ తనకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఆందోళనలు చూస్తుంటే రాజ్‌భవన్ ముట్టడికి ప్రయత్నిస్తున్నట్టు ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు.
కర్ణాటక ప్రభుత్వానికీ, గవర్నర్‌కూ మధ్య ఘర్షణ వాతావరణం నానాటికీ ముదురుతూనే ఉంది. ఇప్పుడు గవర్నర్ ఏకంగా రాష్ట్రపతికి, కేంద్ర హోంశాఖకూ ఫిర్యాదు చేసేవరకూ వచ్చింది. గవర్నర్ ఫిర్యాదు మీద రాష్ట్రపతి, కేంద్ర హోంశాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటాయో అన్న విషయం మీద అన్నివర్గాలలోనూ ఆసక్తి నెలకొంది. ప్రభుత్వానికీ గవర్నర్‌కూ మధ్య ఘర్షణ రాగల వారాల్లో కర్ణాటక రాజకీయ ముఖచిత్రాన్ని మార్చవచ్చు.