1999లో అప్ఘానిస్తాన్‌లోని కాందహార్‌కు వెడుతున్న భారతీయ విమానాన్ని హైజాక్ చేసి పాకిస్తాన్ ఉగ్రవాదులను విడిపించుకున్న సంఘటన ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ తీసిన ఐసి-814 వెబ్ సీరీస్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో ఉగ్రవాదులకు హిందూ పేర్లు పెట్టడంపై సామాజిక మాధ్యమాల్లో రచ్చ జరిగింది. చివరికి కేంద్ర సమాచార ప్రసార శాఖ నెట్‌ఫ్లిక్స్ భారత విభాగం చీఫ్‌కు సమన్లు జారీ చేయడం, ఆ సంస్థ వెబ్‌సీరీస్ ముందు ఒక చిన్న సూచన కలపడం జరిగింది. ఉగ్రవాదులకు హిందూ పేర్లు పెట్టడం అన్న విషయం మీద రచ్చ, ఆ వెబ్‌సీరీస్‌కు అనవసర ప్రచారం కల్పించింది. ఆ సీరీస్‌లో జరిగిన నిజాల వక్రీకరణపై చర్చ లేకుండా పోయింది. వామపక్ష భావజాలం కలిగిన అనుభవ్ సిన్హా చెప్పదలచుకున్న అబద్ధాలు అలాగే ప్రసారం అయిపోతున్నాయి. పాకిస్తానీ గూఢచారి సంస్థ ఐఎస్ఐ గొప్పదనీ, భారత నిఘా విభాగాలు పనికిమాలినవనీ అనుభవ్ సిన్హా చేసిన అబద్ధపు ప్రచారం యథాతథంగా ప్రసారమైంది. ఓటీటీ కంటెంట్‌కు సెన్సార్షిప్ పెట్టలేని కేంద్రప్రభుత్వం అసమర్ధతకు ఈ సినిమా మరో నిదర్శనంగా మిగిలిపోయింది.
విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులను భోలా, శంకర్ అనే పేర్లతో వ్యవహరించడాన్ని పలువురు తప్పుపట్టారు. నిజానికి అది చాలా చిన్న అంశం. హైజాక్ చేసిన ఉగ్రవాదులు ముస్లిములని అందరికీ తెలుసు. హైజాక్ సమయంలో వారు మారుపేర్లతో వ్యవహరించారు. వారి అసలు పేర్లను భారత ప్రభుత్వం తర్వాత వెల్లడించింది. ఆ నేపథ్యాన్ని అడ్డుపెట్టుకుని, వామపక్ష అనుకూలుడైన అనుభవ్ సిన్హా హిందూ పేర్లను ప్రస్తావించాడు. సాంకేతికంగా తన తప్పేమీ లేకుండా జాగ్రత్త పడ్డాడు. ముల్క్, భీడ్, ఆర్టికల్ 15 వంటి సినిమాలు తీసిన అనుభవ్ సిన్హా, ముస్లిం పేర్లను దాచిపెట్టి హైజాకర్ల హిందూపేర్లను హైలైట్ చేయడం అనూహ్యమేమీ కాదు.
హిందీ చలనచిత్ర పరిశ్రమకు ఇస్లామిక్ ఉగ్రవాదంపై సానుభూతి ఎక్కువ. వారి కార్యకలాపాలను సమర్ధించేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూంటుంది. ఉగ్రవాదుల్లో మానవతా దృక్పథాన్ని అన్వేషిస్తూ ఉంటుంది. అంతేతప్ప ఇస్లామిక్ ఉగ్రవాదులు కరుడుగట్టిన నేరస్తులు అని చూపించిన సినిమా హిందీలో ఒక్కటీ లేదంటే అతిశయోక్తి కాదు. బాలీవుడ్‌నే గుడ్డిగా అనుసరించే ఇతర భారతీయ చలనచిత్ర పరిశ్రమలు సైతం అదే పద్ధతిని కొనసాగిస్తున్నాయి. ఆ ధోరణినే ఈ వెబ్ సీరీస్‌లోనూ కొనసాగించారు. గాయపడిన ఎయిర్‌హోస్టెస్‌కు హైజాకర్లు సహాయం చేయడం, విమాన ప్రయాణికులతో అంత్యాక్షరి ఆడడం, ఒక ప్రయాణికురాలికి తాగునీరు ఇవ్వడం వంటి సన్నివేశాలతో హైజాకర్లలోనూ మానవత్వం ఉందని చాటిచెప్పారు. అనుభవ్ సిన్హా కల్పించిన అటువంటి దృశ్యాలను దులపరించేసుకోవలసిందే. ఎందుకంటే హిందీ చిత్ర పరిశ్రమ ఆలోచించే తీరు దాదాపు ఇలాగే ఉంటుంది. ఫిజా, ఫనా, మిషన్ కశ్మీర్, హైదర్ వంటి సినిమాలు దాన్నే నిరూపించాయి. పెద్దసంఖ్యలో జనాలను చంపేసి లేదా విధ్వంసం కలగజేసి ప్రజలను భయభ్రాంతులు చేయడం ప్రధాన లక్ష్యమైన ఉగ్రవాదాన్ని పక్కకు నెట్టి, వారిలో మానవత్వాన్ని వెదకడం వంటి అభూత కల్పనలతో నిజాలను దాచేయడం హిందీ చలనచిత్రాల్లో సర్వసాధారణం. ఇంక వాటికి విస్తృత ప్రచారం కల్పించే మీడియా సంగతి చెప్పనే అక్కర్లేదు. చరిత్రకు, వాస్తవాలకు మసిపూసి మారేడుకాయ చేయడం, అబద్ధాలను, ఫేక్న్యూస్నూ వ్యాపింపజేయడంలో వాటిది అందెవేసిన చేయి. ఇప్పుడు ప్రజాస్వామ్యం మరింత విస్తరించిన సోషల్ మీడియాలోనూ వారిదే పైచేయి.
ఈ చిత్రం ద్వారా అనుభవ్ సిన్హా చెప్పదలచుకున్న ప్రధాన విషయాలు రెండు. అవేంటంటే… 1999 నాటి వాజపేయి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అసమర్ధమైనది, పాకిస్తాన్ ఐఎస్ఐ నిధులతో భారత విమానాన్ని హైజాక్ చేసినవారిలో ఎంతో మానవత్వం ఉంది. ఇక అనుభవ్ సిన్హా ఈ సీరీస్‌లో ఎవరిని లక్ష్యం చేసుకున్నాడు? రా, ఐబీ, విదేశాంగ శాఖ అధికారులు, ఎన్ఎస్జి, ఇతర ప్రభుత్వ అధికారులను ఈ సీరీస్‌లో చూపించిన తీరును గమనిస్తే ఏమాత్రం వివేకం ఉన్నవారికైనా అనుభవ్ సిన్హా లక్ష్యమేమిటో ఇట్టే అర్ధమైపోతుంది. వాజపేయి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని అపకీర్తి పాలు చేయడం, పాకిస్తాన్ ఐఎస్ఐకి క్లీన్చిట్ ఇవ్వడం. ఏ చిన్న వంకతోనైనా రక్తం చిందించడానికి తుపాకులు పట్టుకుని కూర్చున్న కరడు గట్టిన ముస్లిం ఉగ్రవాదుల చేతిలో ఏడు రోజుల పాటు ఇరుక్కుపోయిన ప్రయాణికుల ప్రాణాలను రక్షించడానికి వాజపేయి ప్రభుత్వం చేసిన ప్రయత్నాల మీద బురద చల్లాలన్న అనుభవ్ సిన్హా ఉద్దేశం ఘనంగా నెరవేరింది.
తన ప్రణాళికను అమలు చేయడంలో అనుభవ్ సిన్హా గొప్పగా పనిచేసాడు. స్క్రిప్ట్ తయారీలో, దాని దృశ్యీకరణలో సాంకేతిక దోషాలను వదిలేద్దాం. సీరీస్‌లో ప్రభుత్వ అధికారులుగా నటించినవారితో పలికించిన వాక్యాలను గమనిస్తే, వారిని ఎంత దుర్మార్గులుగా చూపించారో ఇట్టే అర్ధమవుతుంది. విమానం ఇంకా భారత్‌లోనే ఉంది కాబట్టి ప్రశాంతంగా టీ, సిగరెట్లు తాగవచ్చని రా జాయింట్ సెక్రటరీ అంటాడు. ప్రయాణికుల జాబితాలోనుంచి ఒక ప్రముఖ వ్యక్తి పేరు వదిలేస్తే టెన్షన్ తగ్గిపోతుందని ఒక అధికారి అంటాడు. భారత విదేశాంగ శాఖ మంత్రి ఈ హైజాక్ గురించి అసలేమీ పట్టనట్టే ఉంటాడు. కేంద్ర క్యాబినెట్ సెక్రెటరీ ఎవరిమీదకు తప్పులు నెట్టేద్దామా అని చూస్తూంటాడు. విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీ హైజాక్ ఘటనకు కెప్టెన్‌ను బాధ్యుడిని చేయకూడదు అని సుద్దులు చెబుతుంటాడు. అంటే వాజపేయి ప్రభుత్వం అదే పని చేసిందని పరోక్షంగా చెప్పడం. తమ బాధ్యతను పౌరుల మీదకు నెట్టేసి, చేతులు దులిపేసుకుందని ఆరోపించడం. అనుభవ్ సిన్హా తన అనుభవాన్నంతటినీ రంగరించి భారత్ మీద దొంగదాడి చేసాడు. ఇంకా చెప్పాలంటే ఆ హైజాక్ వ్యవహారంలో పాకిస్తాన్ ఐఎస్ఐ నిర్దోషి అని ప్రచారం చేసిపెట్టాడు.
వామపక్షవాది అనుభవ్ సిన్హా జాతీయవాద వాజపేయి ప్రభుత్వం మీద బురదజల్లే పనిని దిగ్విజయంగా పూర్తి చేసాడు సరే. ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తోంది? ‘ఐసి 814 : ది కాందహార్ అటాక్’ వెబ్ సీరీస్ విడుదలయ్యాక రచ్చ జరిగాక నెట్‌ఫ్లిక్స్ భారతదేశపు చీఫ్‌ను పిలిపించింది, చారిత్రక వాస్తవాల వక్రీకరణ గురించి హెచ్చరించింది. బాగానే ఉంది. కానీ సీరీస్ జనాల్లోకి వెళ్ళిపోయాక అరిచి ఏం ఉపయోగం? ప్రజలు ఆన్లైన్లో ఆ సీరీస్ మీద విమర్శలు చేసాక ఏదో ఒకటి చేయాలనుకోవడం వల్ల ఫలితం ఏంటి? ఇంత ఆలస్యంగా మేలుకుని ఉపయోగం ఏముంది? ఓటీటీ కంటెంట్‌కు సెన్సార్ బోర్డ్ లేదు. దాన్ని అవకాశంగా తీసుకుని వామపక్ష ముఠా కంటెంట్ పేరిట తప్పుడు ప్రచారం చేస్తుంటే దాన్ని కనీసం పరిశీలించడానికి సమాచార ప్రసార శాఖ ఏం చేస్తోంది? ప్రచార యుద్ధంలో వామపక్షులతో పోలిస్తే భారత ప్రభుత్వం ఎప్పుడూ వెనుకడుగులోనే ఎందుకు ఉంటుంది? చివరిగా ఒక ప్రశ్న. భావ ప్రకటనా స్వేచ్ఛ, సృజనాత్మక స్వాతంత్ర్యం ఉండాలని కదా వామపక్ష ఉదారవాదులు ఊదరగొట్టేది. అలాంటప్పుడు కంగనా రనౌత్ సినిమా ‘ఎమర్జెన్సీ’ని సెప్టెంబర్ 6న విడుదల చేయకుండా సెన్సార్ బోర్డ్ ఎందుకు ఆపుతోంది? కొన్ని వర్గాల ప్రజల మనోభావాలు దెబ్బతినే అవకాశముందన్న సాకు చూపి ఆ సినిమాను ఎందుకు ఆపేసారు? దాన్నిబట్టి తెలిసే విషయం ఒకటే… వ్యవస్థలన్నీ ఇంకా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి అని. అందుకే, ఎమర్జెన్సీ ఇంకా సెన్సార్ బంధనాల్లో ఉండిపోయింది, ఐసి-814 భారత వ్యవస్థలను తప్పుపడుతూ పాకిస్తానీ ఉగ్రవాదుల్లో మానవత్వాన్ని చాటుతోంది.